చాలా ఘోరం జరిగిపోయింది. ఐదుగురు ఉస్మానియా మెడికల్ విద్యార్ధులు నిన్న విజయవాడ సమీపంలో గొల్లపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరో 17మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, విజయ్‌కృష్ణ, విజయ్ తేజ, మూకా విజయ్, ప్రణవ్, గిరి లక్ష్మణ్ అనే ఐదుగురు విద్యార్ధులు మరణించారు.
హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్య అభ్యసిస్తున్న 46మంది విద్యార్ధులు తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురంలో నిర్వహించబడిన స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని తిరిగి సోమవారం రాత్రి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న ధనంజయ ట్రావెల్స్ బస్సు (ఏపి28 టిబి1166) విజయవాడ సమీపంలో గొల్లపూడి వద్ద సూరయ్యపాలెం అనే ఊరు వద్ద రోడ్డు మలుపు తిరుగుతుండగా బస్సు అదుపు తప్పి రోడ్డు డివైడర్ ని ఆ తరువాత ఎదురుగా ఉన్న పెద్ద చెట్టుని డ్డీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ ధాటికి బస్సులో ఉన్న 46మంది విద్యార్ధులలో ఐదుగురు మెడికోలు, డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందేలా చేయగలిగారు. ఈ సమాచారం తెలియగానే పోలీసులు, జిల్లా అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అందరూ అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారందరికీ మెరుగయిన చికిత్స అందించేందుకు విజయవాడలోని వేరే ఆసుపత్రులకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ త్రాగి అతివేగంగా బస్సును నడపడమేనని బస్సులోని విద్యార్ధులు చెపుతున్నారు.