బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో భాజపాని నిలువరించేందుకు ఆరు జనతా పార్టీలు విలీనమయ్యి జనతా పరివార్ అనే ఒకే పార్టీగా ఏర్పడుదామని ప్రయత్నించాయి. కానీ ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో జెడి(యు), ఆర్.జె.డి., కాంగ్రెస్ పార్టీలు మూడు కలిసి పోటీ చేసి భాజపాని చిత్తు చేయగలిగాయి. బిహార్ లో జనతా ప్రయోగం విఫలం అవడానికి ప్రధాన కారణం జెడి(యు), ఆర్.జె.డి., కాంగ్రెస్ పార్టీలు మూడూ కలిసి దాని అధ్యక్షుడుగా ఎన్నికయిన ములాయం సింగ్ ని పక్కనబెట్టి, సీట్లు పంచేసుకోవడమే.
మళ్ళీ ఇప్పుడు ఝార్ఖండ్ రాష్ట్రంలో మరోసారి జనతా ప్రయోగానికి జెడి(యు), ఝార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజా తాంత్రిక్), సమాజ్‌వాది జనతాపార్టీ(ఎస్.జె.పి.) రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్. ఎల్.డి.), జనతాదళ్ యునైటెడ్ (జె.డి.యు.) పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈసారి కూడా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, శరద్ యాదవ్ చొరవ తీసుకొని ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. అవి ఫలిస్తే త్వరలో మళ్ళీ కొత్తగా ఓ జనతా పరివార్ ఏర్పడవచ్చును. అయితే పార్టీ సిద్దాంతాలు వంటివాటికి ఏమాత్రం పట్టించుకోకుండా, పదవులు, అధికారమే పరమావధిగా జరిగే విలీనాలు కేవలం ఎన్నికల ముందు వరకు మాత్రమే నిలుస్తాయని బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే రుజువయింది. కనుక ఝార్ఖండ్ లో కూడా అలాగే ముగియవచ్చును.