ఈమధ్య కాలంలో యునానిమస్ హిట్ టాక్ దేనికీ రాలేదు. అంటే ఏ,బీ,సీ.. ఇలా సెంటర్లవారీగా తేడా లేకుండా అందరూ హిట్… హిట్.. హిట్ అన్న సినిమా అన్నమాట. అది అ.ఆకి దక్కింది. అన్ని చోట్లా.. అ.ఆ హౌస్‌ఫుల్లే. ఓవర్సీస్లో అయితే పండగ చేసుకొంటున్నారు. అక్కడ రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఆ ఉధృతి ఇప్పట్లో తగ్గదు. అ.ఆ విజయానికి కారణాలేంటి? ఈ సినిమా అంతగా జనంలోకి వెళ్లడానికి రీజన్స్ ఏంటి?
- ఈమధ్య భారీ హైప్.. కొన్ని సినిమాల్ని ముంచేసింది. సర్దార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు భారీ ప్రచారం చేసుకొన్నాయి. ఆ ప్రచారంతో అంచనాలు పెరిగిపోయాయి. తీరా చూస్తే… భారీ డిజాస్టర్లు మూటగట్టుకొన్నాయి. అ.ఆపై అన్ని అంచనాల్లేవు. కారణం.. ఆ సినిమా పబ్లిసిటీ చేసుకోలేదు. హీరో, హీరోయిన్లు మీడియా ముందుకొచ్చారు. ఆఖరి త్రివిక్రమ్ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. సినిమాకి ఎక్కడా హైప్ పెరక్కుండా జాగ్రత్త పడ్డారు. దానికి తోడు సినిమాపై విడుదలకు ముందు… కొంత నెగిటీవ్ టాక్ నడిచింది. దాంతో పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లకు వెళ్లారు. వాళ్లంతా ఈసినిమా చూసి ఫుల్ హ్యాపీ.
- సన్నాఫ్ సత్యమూర్తి త్రివిక్రమ్‌ని బాగా దెబ్బతీసింది. అదేం అంత చెత్త సినిమా కాదు. బాగానే ఉంటుంది. కానీ.. త్రివిక్రమ్ మారాలి.. అన్న విషయాన్ని నొక్కి చెప్పింది. దాంతో రాతలో, తీతలో త్రివిక్రమ్ మారి తీరాలని గట్టిగా నిర్ణయించుకొన్నాడు. ఓ సింపుల్ స్టోరీ ఎంచుకొని.. అందరికీ అర్థమయ్యేలా తెరకెక్కించాడు. ఆల్మోస్ట్ పంచ్‌ల జోలికి వెళ్లలేదు. కాకపోతే తనదైన మార్క్ ఉన్న డైలాగులు బాగా రాసుకొన్నాడు. దాంతో కొత్త త్రివిక్రమ్ కనిపించాడు. సినిమా కూడా కొత్త ఫ్లేవర్‌లో సాగింది.
- రెగ్యులర్‌గా త్రివిక్రమ్ సినిమాల్లో కనిపించే కమెడియన్స్ ఎవ్వరూ ఈ సినిమాలో లేరు. అంతా త్రివిక్రమ్‌కి కొత్తే. అందుకే కొత్త కామెడీ జనరేట్ చేయడానికి వీలైంది. సినిమాలో మరీ అంత కామెడీ గుప్పించేయలేదు. సెకండాఫ్ చాలా సీరియస్‌గా సాగింది. కానీ చివర్లో ఓ ఐదు నిమిషాలు రావు రమేష్‌పై ఓ ఎపిసోడ్ నడిపాడు. అది బాగా క్లిక్కయ్యింది. దాంతో జనాలు నవ్వుకొంటూ థియేటర్ల నుంచి బయటకు వచ్చారు. అది సినిమాపై పాజిటీవ్ ఫీల్ ని తీసుకొచ్చింది.
- ఓవర్సీస్లో త్రివిక్రమ్ కి భారీ బ్రాండ్ ఇమేజ్ ఉంది. అక్కడ విచ్చలవిడిగా ఈసినిమాని చూస్తున్నారు. ఓవర్సీస్లో తెచ్చుకొన్న పాజిటీవ్ టాక్ ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది. అక్కడి ఆడియన్స్ మైండ్ సెట్‌ని ముందే చదివేసిన త్రివిక్రమ్.. వాళ్లకు నచ్చేలా అ.ఆ తీర్చిదిద్దాడు.
- అ.ఆకు ముందు విడుదలైన సినిమాలు ఫ్లాప్ అవ్వడం కూడా పరోక్షంగా ఈ సినిమాకి బాగా కలిసొచ్చాయి. బ్రహ్మోత్సవం చూసిన కళ్లతో అ.ఆ చూస్తే అపురూపంగా కనిపించడం ఖాయం. పైగా సమ్మర్ సీజన్లో ఫ్యామిలీ అంతా చూసే సినిమా ఒక్కటీ రాలేదు. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఓ కొరత ఉండిపోయింది. బ్రహ్మోత్సవం గనుక ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా నచ్చితే.. అ.ఆ వాళ్లముందు తేలిపోయేది. బ్రహ్మోత్సవం ఫ్లాప్ అ.ఆకి అలా కలిసొచ్చింది.