ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని న్యాయశాఖ ఒకే సారి ఐదు జీవోలు విడుదల చేసింది. రోజుకు వందల కొద్దీ జీవోలు విడుదలవుతూంటాయి. అందులో విశేషం ఏమీ ఉండదు. కానీ.. న్యాయశాఖ రిలీజ్ చేసిన ఆ ఐదు జీవోలను బయట వ్యక్తులు ఎవరూ చూడకుండా.. కాన్ఫిడెన్షియల్ చేశారు. అంటే ఆ జీవో నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. అందులో వివరాలేమీ బయటకు తెలియదు. అదే ఇప్పుడు చర్చనీయాశం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన పనులు చేయాలనుకున్నప్పుడల్లా చేసేస్తుంది. కానీ దానికి అధికారికంగా ఆదేశాలు బయటకు తెలియవు. జీవోలు ఇవ్వాలి కాబట్టి ఇస్తుంది.. కానీ వెబ్సైట్లో కాన్ఫిడెన్షియల్ ఖాతాలో పెట్టేసి.. చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసిన తర్వాత అందుబాటులోకి తెస్తుంది. అమరావతి వ్యవహారాల్లో ఉత్తర్వుల దగ్గర్నుంచి అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా తొలగించడం వరకూ..అనేక సందర్భాల్లో ఇది రుజువయింది.
అందుకే ఏపీ ప్రభుత్వం రహస్య జీవోలు ఉంచింది అంటే.. ఏదో వివాదాస్పద నిర్ణయం తీసుకోబోతోందని అర్థం అని చాలా మంది ఓ నిర్ణయానికి వచ్చారు.ఆ ప్రకారం..ఇప్పుడు న్యాయశాఖలో ఒకే సారి విడుదల చేసి … కాన్ఫిడెన్షియల్‌గా ఉంచిన ఐదు జీవోలు అనేక రకాల చర్చలకు కారణం అవుతున్నాయి. ఇటీవలి కాలంలో వ్యాయవ్యవస్థతో ఏపీ సర్కార్ ఘర్షణాత్మక వైఖరితో వెళ్తోంది. అదే సమయంలో… లాయర్ల ఫీజుల అంశంపై వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. కోట్లకు కోట్లు ఫీజులు చెల్లిస్తోంది. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.
ఈ తరుణంలో ఏపీ సర్కార్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుందోనన్న చర్చ ఈ రహస్య జీవోల వల్ల వస్తోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతాయని..ప్రభుత్వానికి ఇబ్బందికరం అవుతుదంని అనుకున్నప్పుడు.. దొంగ చాటుగా పనులు చక్కబెట్టి ఆ తర్వాత ఆదేశాలు జారీ చేయడం… ఏపీ సర్కార్ వ్యూహాల్లో ఒకటి. ఇప్పుడు న్యాయశాఖ ద్వారా.. ఏదో వివాదాస్పద నిర్ణయం తీసుకుందని మాత్రం రహస్య జీవోల ద్వారా వెల్లడవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేమిటో… జరిగిన తర్వాత తెలుస్తుంది.. ఆ తర్వాత జీవోలు వెలుగులోకి వస్తాయి.