ఏపీలో బీజేపీ నేతలు ఏం చేసినా ఎవరికీ తెలియడం లేదు. నిజానికి వారేం చేయడం లేదు. చేసినట్లుగా షో చేస్తున్నారు. అదే సమయంలో వారి భీకర ప్రకటనలకు మాత్రం లోటేమీ ఉండదు. తాజాగా వారు ఏపీ వ్యాప్తంగా సభలు నిర్వహిచాలనుకుంటున్నారు. పదుల్లోనే వందల్లోనో కాదు.. ఏకంగా వేలల్లోనే. ఐదు వేల ప్రజాపోరు సభలు ఏర్పాటు చేస్తామని సోము వీర్రాజు ప్రకటించారు. గత 8 సం.ల కాలంలో రాష్ట్రానికి ఇచ్చిన వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను గురించి, మంజూరు చేసిన అనేక విద్యాసంస్థలను గురించి ఆ సభల్లో చెబుతామని సోము చెబుతున్నారు.
డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండటం వల్ల,ఆయా రాష్ట్రాలలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజలకు ప్రత్యేకంగా బహిరంగ సభల్లో తెలియచేసి.. ఏపీలోనూా బీజేపీ ప్రభుత్వం వచ్చేలా చేయాలని ఏపీ నేతలు ్నుకుంటున్నారు. బహిరంగ సభలలో కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొంటారని చెబుతున్నారు. ఈ సభలను విజయవంతం చేయటానికి ప్రత్యేక కమిటీని కూడ నియమించారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ని స్టేట్ ఇంఛార్చిగా నియమించారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా సభల నిర్వహణ, ఏర్పాట్లు ను నిర్మాణాత్మక పర్యవేక్షణ చేస్తుంది.
అయితే బీజేపీకి అసలు స్థానిక సంస్థల్లో కూడా ప్రతినిధులు లేరు. గ్రామాల్లో కార్యకర్తలు కూడా లేరు. పట్టించుకునేవారు ఉండరు. నియోజకవర్గ స్థాయిలో సభ పెట్టాలనుకున్నా 175 మాత్రమే అవుతాయి. మండలాల వారీగా పెట్టాలనుకున్నా కనీసం వెయ్యి కూడా కావు. మరి ఐదు వేల సభలు ఎక్కడ పెడతారో సోము వీర్రాజు ఆలోచించారో లేదో మరి . మొత్తంగా చూస్తే ప్రకటనలు భీభత్సంగా చేసి.. తాము ఏపీలో ఏదో చేస్తున్నామని హైకమాండ్‌కు చెప్పుకోవడానికి వింత విత ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.