త్వరలోనే జగన్ రెడ్డికి బిగ్ షాక్ తగలబోతుందా? పలువురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడెందుకు రెడీ అవుతున్నారా? ఈమేరకు టీడీపీలో చేరుతామంటూ ఆ పార్టీ నేతలకు వర్తమానం పంపుతున్నారా…? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఇప్పటికే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ నేతలను కలిసి పార్టీలో చేరుతామని తెలిపారు. ఈ క్రమంలోనే శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా వైసీపీలో తమకు ఎదురైన అవమానాలను మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. పవర్ లో ఉన్నంత కాలం జగన్ కలిసి మాట్లాడింది లేదని, తమకు ఎమ్మెల్సీ ఇవ్వడమే ఎక్కువ అన్నట్లుగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతోనే ఎమ్మెల్సీలను జగన్ పిలిచి మాట్లాడారు తప్పితే, అధికారం దక్కితే తమకు జగన్ నుంచి పిలుపు వచ్చి ఉండేది కాదని జకియా ఖానం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆమె మాట్లాడిన విధానం చూస్తే వైసీపీలో కొనసాగే పరిస్థితి లేదని, టీడీపీలో చేరేందుకు సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరో వైసీపీ ఎమ్మెల్సీ ఫరూక్ ను కలిశారని ,మంత్రి అపాయింట్ మెంట్ ఇస్తే మరో ఎమ్మెల్సీ కూడా కలుస్తానని చెప్పినట్లుగా సమాచారం. త్వరలోనే ఐదుగురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.
జగన్ రెడ్డి మాత్రం మండలిలో తమకున్న బలంతో కూటమి సర్కార్ ను ఇరుకున పెట్టాలనుకున్నారు కానీ, వైసీపీ ఎమ్మెల్సీలు ఇలా ఒక్కొక్కరుగా టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తుండటంతో జగన్ ఆశలన్నీ అడియాశలు అయ్యేలాగే కనిపిస్తున్నాయి.