గంగిరెద్దుకు క్యూఆర్ కోడ్ స్కాన్ పెట్టుకుని డిజిటల్ రూపంలో డబ్బులు తీసుకుంటున్న ఓ వ్యక్తి వీడియోను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియాలో పంచుకుని .. నోట్ల రద్దు సక్సెస్‌కు అదే గొప్ప సాక్ష్యం అని అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు. డబ్బుల చెలామణి తగ్గించి డిజిటల్ విధానాన్ని ప్రోత్సహించడానికే నోట్ల రద్దు అని కేంద్రం తర్వాత ప్రకటించి.. దాన్నే ప్రచారం చేస్తోంది. నిజానికి ప్రజల నగదు చెలామణి ఐదేళ్లలో ఏ మాత్రం తగ్గలేదు సరి కదా.. యాభై శాతం పెరిగింది. నవంబర్ 4, 2016న రూ.17.97 లక్షల కోట్లుగా ఉన్న ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, అక్టోబర్ 8, 2021 నాటికి రూ. 28.30 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన చూస్తే ఈ పెంపు ఏకంగా 57.48 శాతం ఉంది. అంటే కేంద్రం తన లక్ష్యంగా అడ్డంగా విఫలమయిందన్నమాట.
నిజానికి కేంద్రం అసలు నోట్ల రద్దు ఉద్దేశంలో డిజిటల్ చెలామణి కానే కాదు. డిజిటల్ చెలామణి చేయాలంటే ప్రజల్ని.. ఆర్థిక వ్యవస్థను రిస్క్‌లో పెట్టి నోట్ల రద్దు చేయాల్సిన పని లేదు. వారు చెప్పిన మొదటి కారణం బ్లాక్ మనీ. బ్లాక్ మనీ ఎక్కడ ఉన్నా బయటకు వస్తుందని చెప్పి.. ప్రజల్ని రెచ్చగొట్టారు. వారు ఎన్ని సమస్యలు పడినా దేశం బాగుపడుతుందని పంటి కింద బాధను దిగమింగారు. రోడ్డు మీద టీతాగడానికి చిల్లర పైసలు లేక బాధపడినా భరించారు. తమ డబ్బులు తాము తీసుకునేందుకు బ్యాంకుల ఎదుట, ఏటీఎంల ముందు పడిగాపులు పడినా క్షమించారు. కానీ నల్లధనం మాత్రం బయటకు రాకపోగా.,. వచ్చినదంతా వైట్ అయిపోయింది. అదెలా అయిందో పాలకులకే తెలియాలి.
బ్లాక్ మనీ రాలేదు.. నగదు చెలామణి తగ్గలేదు. కానీ ఆ నోట్ల రద్దు ఎఫెక్ట్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోయాలని విశ్లేషణలు వచ్చాయి. కొంత మంది నిరాశానిస్ప్రహలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. నోట్ల రద్దు సమయంలో బ్యాంకులో డబ్బులు ఉన్నప్పటికీ వైద్యానికి డబ్బులు చేతికి అందక వందల మంది చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. పెళ్లిళ్లు ఆగిపోయాయి. తిండి.. తిప్పలకూ ఇబ్బంది పడిన వారు ఉన్నారు. వీటన్నింటికీ కేంద్రమే కారణం. ముందూ వెనుకా చూడకుండా నోట్ల రద్దు చేయడమే కారణం. కొసమెరుపేమిటంటే నోట్ల రద్దు వల్ల ఏం సాధించారో కేంద్రం నేరుగా చెప్పలేదు కానీ.. సంబరాలు చేసుకుంటూ ఉంటుంది. అదే రాజకీయం మరి !