హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త ఐపీఎల్లో ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని.. అన్ని టీములు అలర్ట్ గా ఉండాలని బీసీసీఐ ఓ సందేశం పంపింది. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు ఆయనకు ఫిక్సింగ్ చేసిన అనుభవం కూడా ఉందట. అందుకే ఎవరినైనా సంప్రదించినట్లుగా తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా బీసీసీఐ హెచ్చరికల్ని జారీ చేసింది.
ఐపీఎల్ లో ఫ్రాంచైజీల యాజమాన్యాలే ఫిక్సింగ్ చేసిన చరిత్ర ఉంది. గతంలో రెండు టీములపై నిషేధం కూడా విధించారు. చెన్నై ఫ్రాంచైజీకి చెందిన అయ్యప్పన్ అనే సహయజమానిని బహిష్కరించారు కూడా. అయితే ఈ ఫిక్సింగ్ వ్యవహారంలో అది చాలా చిన్నదని బయటకు తెలియాల్సినవి చాలా ఉన్నాయని క్రికెట్ అభిమానులు అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా వచ్చినప్పుడు అదే అనుకుంటారు.
ఐపీఎల్ టోర్నీ మొత్తం స్క్రిప్టెడ్ అని అనుకోని క్రికెట్ ఫ్యాన్ ఉండరు. ఎందుకంటే ఏ ఒక్క టీమ్ కూడా.. ఓ పద్దతిగా ఆడదు. రోలర్ కోస్టర్ రైడ్ మాదిరిగి.. ఓ మ్యాచ్లో మూడువందలు కొడితే మరో మ్యాచ్లో అందులో సగం పరుగులు కూడా చేయదు. అయితే ఫ్యాన్స్ తాము జనరల్ గా మాట్లాడుకునే మాటలకు ఆధారాలు ఉండవు. కానీ బీసీసీఐ ఇలాంటి హెచ్చరికలు జారీ చేసినప్పుడు మాత్రం.. ఏదో జరుగుతోందని అనుకుంటారు. ఐపీఎల్లో చొరబడాలనుకుంటున్న ఈ హైదరాబాదీ ఫిక్సర్ ఎవరో మాత్రం ఇంకా బయటకు రాలేదు.