కొన్నేళ్ల క్రితం ప్రకాష్‌రాజ్‌ని ‘మా’ అసోసియేషన్ బ్యాన్ చేసిన సంగతి ఇప్పటికీ ఏదో ఓ సందర్భంలో తలచుకొంటుంటాం. ఆ తరవాత ఏ నటుడ్నీ అలా బ్యాన్ చేయలేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే… ఓ నటి ఇలాంటి అనధికారిక బ్యాన్ ఎదుర్కొన్న ఘటన ఒకటి కళ్ల ముందు కదులుతుంది. ఆమెనే జమున. ఆనాటి అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్, ఏఎన్నార్లు జమునపై కోపంతో ఆమె పక్కన నటించమని చెప్పేశారు. అలా ఈ ఇద్దరు అగ్ర హీరోల సరసన నాలుగేళ్ల పాటు సినిమాలు చేయలేకపోయారు జమున. ఆ ఫ్లాష్ బ్యాక్‌లోకి ఒక్కసారి వెళ్తే…
‘భూ కైలాస్’ షూటింగ్ జరుగుతోంది. చెన్నైలోని మెరీనా బీచ్‌లో సీన్ ప్లాన్ చేశారు. అది ఎండాకాలం. సూర్యుడు ఉదయించే సమయానికి తొలి షాట్ తీయాలి. అంటే ఉదయం ఆరు లోపే క్లాప్ కొట్టేయాలి. రావణాసురుడిగా ఎన్టీఆర్, నారధుడిగా ఏఎన్నార్, ఆయన భార్యగా జమున నటిస్తున్నారు. ఎన్టీఆర్, అక్కినేని ఐదున్నరకే లొకేషన్‌కు వచ్చేశారు. కానీ జమున మాత్రం రాలేదు. ఆరయ్యింది. ఏడయ్యింది. పదయ్యింది. జమున జాడ లేదు. అసలే ఎండాకాలం. పైగా చెన్నై. ఆ ఎండకు టీమ్ అంతా మలమల మాడిపోతోంది. ఎప్పుడో పదిన్నరకు జమున కారు వచ్చి లొకేషన్లో ఆగింది. దిగిన వెంటనే హడావుడిగా అందరికీ ‘హాయ్…హాయ్’ అంటూ ముక్తసరిగా పలకరిస్తూ దర్శక నిర్మాతల దగ్గరకు పరిగెట్టారు జమున. ఓ పక్క ఇద్దరు టాప్ హీరోలు, ఆమె కోసం ఎదురు చూస్తుంటే కనీసం ఆలస్యమైనందుకు క్షమాపణ కూడా చెప్పకుండా జమున అలా పరుగెట్టి దర్శకుడి దగ్గరకు వెళ్లడం ఎన్టీఆర్‌కు అస్సలు నచ్చలేదు.
షూటింగ్ మొదలెట్టారు. సీన్ ఏంటంటే… శివలింగాన్ని ఎన్టీఆర్ (రావణాసురుడు) తన తలతో బాదుకొంటుంటే దూరాన ఉన్న అక్కినేని (నారదుడు) తన భార్య జమునని పట్టుకొని ఎన్టీఆర్ దగ్గరకు పరిగెట్టాలి. ఇదీ షాట్. సాధారణంగా ఎలాంటి షాట్ అయినా ఒకటీ లేదంటే రెండు టేకుల్లో చేసేసే ఎన్టీఆర్.. ఈసారి మాత్రం టేకుల మీద టేకులు తినేస్తున్నారు. అంతకు ముందే ఓ షూటింగ్ లో అక్కినేని కాలికి గాయమైంది. ఆయనేమో జమునతో పరిగెట్టలేకపోతున్నారు. దాంతో షాట్ గ్యాప్‌లో ఎన్టీఆర్ ని పక్కకు తీసుకెళ్లి ”బ్రదర్.. మీరు జమునపై కోపంతో నన్ను పరిగెట్టిస్తున్నారు. ఎండా కాలం. పైగా కాలికి చెప్పులు కూడా లేవు. ఓవైపు కాలికి గాయమైంది. నేను పరిగెట్టలేకపోతున్నా” అని తన బాధ చెప్పుకొన్నారు. దాంతో అక్కినేని ఇబ్బంది గ్రహించిన ఎన్టీఆర్, మరుసటి టేక్ ‘ఓకే’ అనిపించారు. దాంతో ఆ రోజు షూటింగ్ పూర్తయ్యింది. హమ్మయ్య అంటూ అక్కినేని కార్ ఎక్కబోతోంటే.. ఎన్టీఆర్ ఆపారు. ‘బ్రదర్.. మనం ఒకే కారులో వెళ్దాం’ అంటూ ఎన్టీఆర్ తన కారులో అక్కినేనిని ఎక్కించుకొన్నారు. మార్గ మధ్యలో జమున టాపిక్ తీసుకొచ్చారు. ”మనల్ని ఇంత సేపు వెయిట్ చేయించి కూడా జమున సారీ చెప్పలేదు. ఇది క్షమించరాని నేరం. ఇక నుంచి నేను జమునతో సినిమాలు చేయను. మీరు కూడా చేయొద్దు” అంటూ ఎన్టీఆర్ హుకుం జారీ చేశారు. దాంతో ఏఎన్నార్ కూడా కాదనలేకపోయారు. అలా దాదాపు నాలుగేళ్ల పాటు ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో జమున నటించలేదు. జమున పీక్స్‌లో ఉన్న సమయం అది. పెద్ద హీరోలు అవకాశాలు ఇవ్వకపోయినా, మీడియం రేంజు హీరోలతోనే నటిస్తూ, తన స్టార్ డమ్ కాపాడుకొన్నారు.
చివరికి చక్రపాణి వల్ల జమున బ్యాన్ తొలగింది. ‘గుండమ్మ కథ’లో తనకు జముననే కావాలి అనుకొన్నారు చక్రపాణి. ఎన్టీఆర్, ఏఎన్నార్లను పిలిచి ‘జమున లేకపోతే ఈ పాత్ర లేదు. నా కథకు మీరెంత ముఖ్యమో జమున కూడా అంతే ముఖ్యం. ఇన్నాళ్లూ ఆమెను దూరం పెట్టారు. ఈ శిక్ష చాలు’ అనడంతో ఎన్టీఆర్, ఏఎన్నార్లు కాదనలేకపోయారు. అలా జమున మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ‘గుండమ్మ కథ’లో జమున పాత్రకు మంచి పేరొచ్చింది. ఆ తరవాత ఆమె స్టార్ డమ్ కూడా జోరందుకొంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత గొడవని మర్చిపోయి మళ్లీ ఆమెతో సినిమాలు చేశారు. ఈ విషయాన్ని ఏఎన్నార్ తన ఆత్మ కథలో వివరంగా రాసుకొన్నారు కూడా.