వంశీ మేకింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన సినిమాల్లో పాటల దగ్గర్నుంచి, ఫ్రేమింగుల వరకూ అన్నీ కొత్తగా కనిపిస్తాయి. హీరోల్ని, హీరోయిల్నీ ఒప్పించే విషయంలోనూ ఆయన డిపరెంటే. ఒక్కోసారి హీరోకి పూర్తి కథ కూడా చెప్పకుండానే తనతో పనిచేయడానికి ‘ఐతే ఓకే..’ అనిపించేస్తుంటారు. అయితే కథ ఏమాత్రం చెప్పకుండా.. సినిమా పూర్తి చేసేసిన సందర్భం కూడా ఉంది. అయితే అది హీరోకి కాదు, హీరోయిన్‌కి.
ఏప్రిల్ 1 విడుదల సినిమా తీసే రోజులవి. కథానాయిక పాత్ర కోసం శోభనని అనుకున్నారు. అప్పటికే శోభన చాలా బిజీ. ‘వంశీ గారూ…. కథ చెప్పండి. నచ్చితే చేస్తాను’ అంది శోభన. కానీ వంశీకి కథ చెప్పే తీరిక దొరకలేదు. అంతలోనే సినిమా కూడా మొదలైపోయింది. సెట్ కి వస్తారు కదా, అప్పుడు చెబుతాను లెండి.. అన్నారు వంశీ. శోభన కూడా వంశీపై నమ్మకంతో సరే అంది. సెట్లో ఏమాత్రం ఖాళీ దొరికినా.. ‘వంశీగారూ.. కథ చెప్పండి’ అంటూ శోభన అడిగేది. కానీ.. వంశీ కథ చెప్పేలోగా.. ఏదో ఓ చిన్న సమస్య వచ్చి పడేది. రోజులు, వారాలూ గడుస్తున్నాయి. `అసలు ఈయన ఏం తీస్తున్నాడు?’ అనే డౌటూ.. శోభనని వెంటాడేది. చివరికి ఓరోజు… ఏదైతే అదే అయ్యిందని ”ఈరోజు నాకు కథ చెబుతారా, లేదా” అంటూ వంశీని నిలదీసిందట శోభన. విచిత్రం ఏమిటంటే సరిగ్గా అదే రోజు… సినిమా షూటింగ్ అయిపోయి, పేకప్ కూడా చెప్పేశారు. ఇదే విషయం శోభనకు చెబితే… `అయ్యో వంశీగారూ.. నాకు కథ చెప్పకుండానే సినిమా పూర్తి చేసేశారే..` అంటూ నవ్వేసిందట. ఆ సినిమా సూపర్ హిట్టయ్యింది. వంశీ టేకింగు, ఇళయరాజా పాటలకు మంచి మార్కులు పడ్డాయి. రాజేంద్ర ప్రసాద్‌కి ఎంత మంచి పేరొచ్చిందో, శోభనకూ అంతే గుర్తింపు దక్కింది.