విజయావారి మాయాబజార్ సినిమాని మనలో చాలామందే చూసే ఉంటారు. ఆ సినిమాలో శ్రీకృష్ణుడు, అభిమన్యుడు, ఘటోత్కచుడు పాత్రల్లో ఒదిగిన ఎన్టీఆర్, ఏఎన్నార్, యస్వీఆర్ ఎలా కళ్లముందు కదలాడుతారో అంతే స్థాయిలో మరో పాత్రధారి కూడా మనకు చటుక్కున గుర్తుకు వస్తారు. అదే, శకుని పాత్రధారి. ఈ పాత్రను పోషించింది మరెవరో కాదు ప్రఖ్యాత రంగస్థల,సినీ నటుడు సి.ఎస్. ఆర్ . ఆంజనేయులుగారే.
ఈ సినిమాలో శశిరేఖకూ, లక్షణకుమారునికి పెళ్ళి వేడుక జరుగుతుంటుంది. మగపెళ్ళివారి విడిది ఇంట్లో పెండ్లికి పెద్దలుగా వచ్చిన శర్మ, శాస్త్రులు నానా గందరగోళం పడుతుంటే వాళ్లను ఛీత్కరించుకుంటూ సీఎస్ఆర్ పలికే డైలాగ్ లు (ఆడపెళ్ళివారిని ఏడిపించండర్రా అంటే మొగపెళ్ళి వారినే మమ్మల్నే ఆటపట్టిస్తున్నారే..) ఇప్పటికీ మిమిక్రీ ఆర్టిస్టులు ఇమిటేట్ చేసి ఆహుతులను నవ్విస్తుంటారు. అంతేకాదు, ఆడియో పరమైన వ్యాపార ప్రకటనలు చేసేటప్పుడు ఈ వాయిస్ ను ఇమిటేట్ చేస్తుండటం కద్దు. అంత పెక్యూలర్ వాయిస్ ఇది.
సీఎస్ఆర్ ఆంజనేయులుగారు కీర్తిశేషులై అర్థశతాబ్ది దాటినా ఇప్పటికీ ఆ కంఠస్వరం తెలుగువాడి గుండెలను కదిలిస్తూనేఉంది. ఓసారి ఈ `మాటలకారి శకుని’ని గురించి ముచ్చటించుకుందాం…
సీఎస్ఆర్ ఆంజనేయులు గారంటేనే మేనరిజంతో కూడిన డైలాగ్ లకు పర్యాయపదంలా ఉండేవారు. అది అమాయకరాజు పాత్రలో కావచ్చు, మంత్రి పాత్ర కావచ్చు, లేదంటే మామ, కాదంటే ముసలి మొగుడు పాత్ర కావచ్చు – సిఎస్ఆర్ చెప్పే డైలాగులకు అప్పట్లో హాలులో చప్పట్లుపడేవి. చాలా సులువుగా, భాషలో స్పష్టత కోల్పోకుండా పదాలు పలకడం సిఎస్ఆర్ గొప్పతనం. గొప్ప నటులకు ఉండవలసిన మూడు ప్రధాన లక్షణాలను (ఆంగికం, వాచకం, అభినయం) ఆయన తన సొత్తుగా చేసుకున్నారు కనుకనే, తొలి టాకీ సినిమాల్లోనే అటు పౌరాణిక, ఇటు సాంఘిక, మరో పక్క జానపద సినిమాల్లో తనదైన మార్కు కొట్టేశారు సీఎస్ఆర్.
వీరి పూర్తి పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు. నాటకాలప్పుడు ఇదే పేరు చలామణి అయినా, సినిమాల్లో చేరేసరికి సీఎస్ఆర్ ఆంజనేయులుగా గుర్తింపుపొందారు. అది కూడా పొడువుగా ఉండటంతో చాలా మంది సంక్షిప్త రూపంగా సీఎస్ఆర్ అనే పిలిచేవారు.
సినిమాల్లో గొంతు వినిపించడం మొదలైన తొలి రోజుల్లోనే (టాకీ సినిమాలు వచ్చిన కొత్తల్లోనే) సీఎస్ఆర్ అగ్రనటులుగా పేరుతెచ్చుకున్నారు. ఈయన ద్రౌపదీ వస్త్రాపహరణం(1936)చిత్రంలో శ్రీకృష్ణునిగా కూడా నటించారు. గృహప్రవేశం (1946) చిత్రంలో సీఎస్ఆర్ కామెడీ విలన్ గా నటించి ప్రేక్షకుల ప్రంశంసలు అందుకున్నారు. సీఎస్ఆర్ సినిమాల్లో జనంలో పాపులర్ అయిన కొన్ని డైలాగ్ లు…
1.
`మైడియర్ తులసమ్మక్కా ‘ – చిత్రం – గృహప్రవేశం
2
`ఆకాలంలో నేను కాలేజీ చదువుకునే రోజుల్లో… ‘ – చిత్రం -జీవితం
3.
`హే రాజన్ శృంగార వీరన్ ‘ – చిత్రం – జగదేకవీరుని కథ
4.
`వెయ్యి రూపాయిలు కావాలంటే పది మంది దగ్గరా పది వందలు తీసుకోవడం కంటే ఒక్కరి దగ్గిరే అప్పుతీసుకో. వడ్డీ తీరిస్తే సరి. అసలు చెల్లించినప్పటి మాట కదా ‘ – చిత్రం – అప్పుచేసి పప్పుకూడు.
5.
`ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది… ‘ చిత్రం – మాయాబజార్.
6.
`పార్వతీ… చంద్రబింబంలాంటి నీ ముఖం మీద, ఆ మచ్చేమిటీ ? ‘ – చిత్రం దేవదాసు
నటునిగా బాగానే సంపాదించినా, దర్శకత్వ శాఖలో అడుగుపెట్టి చేతులు కాల్చుకున్నారని సినీపెద్దలు చెబుతుండేవారు. ఆయన జాతీయవాదిగా ఉండేవారు. సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి అప్పట్లో `తుకారం’ అనే నాటకాన్ని ప్రదర్శించి, అలా వచ్చిన పదివేల రూపాయలను విరాళంగా ఇచ్చేశారు.
ఆనాటి నటుడి గురించి మనం ఈనాడు కూడా మాట్లాడుకుంటున్నామంటే, నటనకు మరణం లేదన్న సత్యం మరోసారి ఋజువైనట్టే. వీలుగా ఉంటే ఓసారి పైన ఉటంకించిన చిత్రాల్లో కొన్నింటినైనా చూడండి, ఆ తర్వాత మీరు సీఎస్ఆర్ ఫ్యాన్ అవడం ఖాయం.
– కణ్వస