‘శ్రీదేవి ఎంత అందగత్తె. అలాంటి అందగత్తె రెండో పెళ్ళివాడ్ని చేసుకోవడం ఏంట్రా?’ ‘అదృష్టం అంటే బోనీ కపూర్దేరా… శ్రీదేవిని చేసుకున్నాడు!’ – హిందీ హీరో అనిల్ కపూర్ సోదరుడు, నిర్మాత బోనీ కపూర్, శ్రీదేవిల వివాహాం జరిగినప్పుడు ఎంతోమంది ప్రేక్షకుల నోటి నుంచి ఇటువంటి మాటలు వినిపించాయి. అప్పట్లో శ్రీదేవి పెళ్లి ఒక సంచలనం. ఈ పెళ్ళి కథ, పెళ్ళికి ముందు ప్రేమకథ గురించి తెలుసుకోండి!
ఓ రోజు బోనీ కపూర్ ఒక తమిళ సినిమా చూశారు. అందులో హీరోయిన్ ఆయనకు తెగ నచ్చేసింది. తెర మీద చూసి పిచ్చి పిచ్చిగా ప్రేమించారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. అప్పటికి హిందీ సినిమా ఇండస్ట్రీలో బోనీ ఫ్యామిలీ ఒక పొజిషన్లో వుంది. బోనీ తండ్రి సురేంద్ర కపూర్ నిర్మాత. తమ్ముడు అనిల్ కపూర్ హీరో. బోనీ కూడా నిర్మాతగా అడుగులు వేస్తున్నారు. అవన్నీ పక్కనపెట్టి వెంటనే శ్రీదేవిని కలవాలని బోనీ ముంబయ్ నుంచి మద్రాసులో వాలారు. ప్చ్… శ్రీదేవి మద్రాసులో లేదు. సింగపూర్‌లో ఏదో సినిమా షూటింగ్లో వున్నారు. డిజప్పాయింట్మెంట్తో ముంబయ్ రిటర్న్ వెళ్లారు. ఆ తర్వాత హిందీ సినిమా ‘సోలవ్ సావన్’లో శ్రీదేవిని మళ్ళీ చూశారు బోనీ. ఎలాగైనా ఆమెను కలవాలనుకున్నారు.
హిందీ సినిమా షూటింగ్ కోసమని శ్రీదేవి ముంబయ్‌లో వున్నారని తెలుసుకుని సెట్స్ కి వెళ్ళారు. పరిచయం లేని వ్యక్తులతో పెద్దగా మాటలు కలిపే అలవాటు లేని అతిలోక సుందరి ముక్తసరిగా మాట్లాడారు. ఆ తర్వాత చాలా రోజులు అంతే. ఇద్దరి మధ్య పొడి పొడి మాటలే. ఇలా అయితే లాభం లేదు. శ్రీదేవితో సినిమా తీయాలని బోనీ కపూర్ నిర్ణయించుకున్నారు. అదే సమయంలో తమ్ముడు అనిల్ కపూర్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా ‘మిస్టర్ ఇండియా’ ప్లాన్ చేస్తున్నారు. అందులో కథానాయికగా శ్రీదేవిని తీసుకోవాలనుకున్నారు. శ్రీదేవి అమ్మను సంప్రదిస్తే, రెమ్యునరేషన్ పది లక్షలు అడిగారు. అప్పట్లో అది చాలా ఎక్కువ. కథానాయికలకు ఆరేడు లక్షల లోపే రెమ్యునరేషన్ ఇచ్చేవారు. శ్రీదేవిపై అభిమానంతో బోనీ పదకొండు లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. శ్రీదేవితో ఎలాగైనా మాటలు కలాపాలనేది ఆయన అంతరంగం. ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. కానీ, లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వుండేది.
బోనీకి హిందీ, ఇంగ్లిష్ వచ్చు. శ్రీదేవిది వచ్చీరాని హిందీ, కొంచెం ఇంగ్లీష్ అంతే. అయితే.. నిర్మాతగా బోనీ కపూర్ తొలి చిత్రం ‘హమ్ పాంచ్’. ఆ చిత్రానికి దర్శకుడు బాపూగారు. తెలుగులో ఆయన తీసిన ‘మన ఊరి పాండవులు’కి అది రీమేక్. తర్వాత బాపూగారితో మరో రెండు సినిమాలు నిర్మించారు బోనీ. అలా కొంచెం కొంచెం అలవాటైన తెలుగు శ్రీదేవితో మాట్లాడడానికి బోనీకి సహాయపడింది. ‘మిస్టర్ ఇండియా’ షూటింగ్ టైములో శ్రీదేవి అమ్మతోనూ మంచి పరిచయం ఏర్పడింది. ఆవిడకు ఏదైనా సమస్య వస్తే బోనీతో డిస్కస్ చేసేవారట. ఒకసారి మా ఇంటికి శ్రీదేవి అమ్మగారు వచ్చినప్పుడు ‘బోనీజీ లాంటి అబ్బాయితో మా అమ్మాయికి పెళ్లి చేయాలన్నారు’ అని బోనీ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
శ్రీదేవి అమ్మగారి మనసులో మంచి మార్కులు వున్నాయని బోనీకి అర్థమైంది. శ్రీదేవితో మంచి స్నేహం కుదిరింది. ఇక ఆలస్యం చేయడం ఎందుకని శ్రీదేవికి తన మనసులో ప్రేమ మాటను చెప్పారు బోనీ. మూడు నెలల పాటు శ్రీదేవి తన మనసులో మాటను బయటకు చెప్పలేదు. ఇక్కడ బోనీ మనసులో విపరీతమైన టెన్షన్. చివరికి, శ్రీదేవి ‘యస్’ చెప్పారు. బహుశా… ఈ మూడు నెలల్లో బోనీకి అప్పటికే ఒక పెళ్ళైన విషయం గురించి, సమాజం ఏమనుకుంటుందనే విషయం గురించి శ్రీదేవి ఆలోచించి వుంటారు. తర్వాత 1996జూన్ 2న పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి తర్వాత నుంచి విడిచే వరకూ ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ చూసినా ఇద్దరూ చేతిలో చెయ్యి వేసుకుని కనిపించేవారు. మిగతా కథ ప్రేక్షకులకు తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు వారికి జాహ్నవి, ఖుషి. పెద్దమ్మాయ్ త్వరలో కథానాయికగా హిందీ తెరపైకి రానున్న సంగతి తెలిసిందే.