తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయడంతో ఓటమి భయం కారణంగానే ఇలా చేస్తున్నారని ఎక్కువగా చర్చ జరుగుతోంది. నిజానికి కారణం ఓటమి భయం కాకపోవచ్చు కానీ .. పరిస్థితులు మాత్రం ఏకపక్షంగా లేవన్న అభిప్రాయం గజ్వేల్ లోనే వినిపిస్తోంది. ఈటల రాజేందర్ బరిలోకి దిగడానికి కేసీఆర్ పై ప్రజల్లో అసంతృప్తిని గుర్తించడమే కారణంగా చెబుతున్నారు.
కేసీఆర్‌కు ప్రధాన సమస్యగా మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్య ఉంది. ఈ రెండు ప్రాంతాల పరిధిలో పది గ్రామపంచాయతీలల్లో 15 వేల మంది ఓటర్లున్నారు. వీరికి ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చినా, ఇళ్లు కట్టించి ఇచ్చింది. కానీ పొలాలకు పరిహారం విషయంలో మాత్రం అసంతృప్తి నెలకొని ఉంది. పైగా భూసేకరణ సమయంలో తీవ్ర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. అనేక కోర్టు కేసులు పడ్డాయి. వీరు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటేస్తారన్న అనుమానంతో వారికి మంత్రి హరీశ్‌రావు వారితో సమావేశమయ్యారు. కేసీఆర్‌ను గెలిపిస్తేనే మీ ఆకాంక్షలన్నీ నెరవేరుతాయని గుర్తుంచుకోవాలని కోరారు.
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి టి.నర్సారెడ్డి కూడా నిర్వాసితుల ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. మరో వైపు బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరాటం కూడా సమస్యగా మారింది. గత రెండుసార్లు కేసీఆర్ పై పోటీ చేసి ఓడిపోయిన ప్రతాప్ రెడ్డి సహా మొత్తం నలుగురు ఐదుగురు కీలక నేతలు గజ్వేల్ పై పెత్తనం తమదేనని అనుకుంటున్నారు. ఎవరికి వారు వారి అనుచర వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వారు చేస్తున్న దందాలతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.
ఎలా చూసినా కేసీఆర్ ను కాదని గజ్వేల్ ప్రజలు ఈటల రాజేందర్ ని కానీ మరో నేతను కాని గెలిపించే పరిస్థితి లేదు అలాగని ఏకపక్షంగా కూడా ఏమీ లేదని తాజా పరిస్థితుల ప్రకారం అంచనా వేస్తున్నారు.