తిరుమలలో ఆనంద నిలయం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అసలు టీటీడీ భద్రతా వ్యవహారాలపైనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఎన్నో కోట్లు పెట్టి.. ఆలయంలోకి చిన్న అనుమానాస్పద వస్తువు కూడా తీసుకెళ్లకుండా ఉండేలా టెక్నాలజీని రెడీ చేసుకున్నారు. కానీ కెమెరా ఎలా వెళ్లగలిగింది. పెన్ను కెమెరా అని మరొకటి అని కబుర్లు చెబుతున్నారు. అదయినా ఎలా వెళ్లగిలింది ? అనేది మాత్రం చెప్పడం లేదు. ఆనంద నిలయంలో విజువల్స్ తీసుకుంటే..ఇక దర్శనంకు వెళ్లినప్పుడు మూలవిరాట్టు దృశ్యాలు తీయలేదని గ్యారంటీ ఏంటి ?
టీటీడీ బోర్డే ఓ అరాచకం !
టీటీడీ బోర్డు నిండా వ్యాపారస్తులే ఉన్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో వందల కోట్లకు ముంచిన ఓ సభ్యుడ్ని ఇటీవల తొలగించి.. జగన్ బయోపిక్ తీస్తున్న నిర్మాతను సభ్యుడిగా పెట్టారు. ఇలాంటి క్రైటీరియాతో జంబో టీటీడీ బోర్డును ఏర్పాటు చేశారు. చివరికి వారంతా టిక్కెట్లు అమ్ముకోవడానికి లాబీయింగ్‌లు చేసుకోవడానికి తమ పరపతిని వినియోగిసతున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు కాకపోయినప్పటిక విజయ్ కుమార్ స్వామి అనే వ్యక్తి తిరుమలలో సాగిస్తున్న హవా చూసిన వారికి ఇదేం అరాచకం అనిపించక మానదు.
నిర్వీర్యమైన విజిలెన్స్, భద్రతా వ్యవస్తలు
టీటీడీ బోర్డు పరిపాలనా దారుణంగా ఉండటం..అన్నీ నిబంధనల ఉల్లంఘనలే ఉండటంతో అన్ని వ్యవస్థల్లోనూ నిర్లక్ష్యం పేరుకుపోయింది. విజిలెన్స్, భద్రతా బృందాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. ఇటీవల కొండపై గంజాయి కూడా పట్టుబడింది. ఇంకా లెక్కలేనన్ని అరాచకాలు వెలుగు చూశాయి. ఇప్పుడు నేరుగాఆనంద నిలయంలోకే కెమెరా తీసుకెళ్లగలిగారు. ఇదంతా ఎలా సాధ్యమవుతోదన్న విషయం అర్థం చేసుకోవడం బ్రహ్మపదార్థమేం కాదు. రాష్ట్రంలోలాగే.. తిరుమలలోనూ తమ స్వార్థం కోసం వ్యవస్థల్నీ నిర్వీర్యం చేశారు.
సామాన్య భక్తులకు చుక్కలే !
సామాన్య భక్తులు.. ఏడాదికో..రెండేళ్లకో తిరుమలకు వెళ్లి ఒక్క క్షణం శ్రీవారిదర్శనం చేసుకుని వస్తూంటారు. వారికి. టీటీడీ బోర్డు చుక్కలు చూపిస్తుంది. ఓ కుటుంబం శ్రీవారి దర్శనానికి వెళ్లి రావాలంటే రూ. పదివేలు ఖర్చు పెట్టేలా చేస్తుంది. ఖర్చు పెట్టుకోలేకపోతే నరకం అనుభవించాల్సిందే. కొండపై మంచి నీళ్లు కూడా దొరకవు. ఇలా వెళ్లిన భక్తుల్లో పదిశాతం కూడా టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయరు. కొండ మీదే బహిరంగంగా విమర్శలు చేస్తూంటారు. చివరికి క్యూలైన్లలో వేచి ఉండేవారికి మంచి నీళ్లు కూడా ఇవ్వరు కానీ..అక్కడికి తినుబండారాలను అమ్మేవాళ్లను అనుమతిస్తారు.
ఇలాంటి వ్యవహారాలతో టీటీడీని భ్రష్టుపట్టించారు. వీరిని ఆ దేవుడే దారిలో పెట్టాల్సి ఉంది.