అమేజాన్ అనే బడా అమెరికా కంపెనీలో మంచి ఉద్యోగాలున్నా ఆ యువకులు సంతృప్తి చెందలేదు. ఆ కంపెనీనే చాలెంజ్ చేసే మరో కంపెనీని స్థాపించారు. ఫోర్బ్స్ అత్యంత సంపన్నుల జాబితాలో 86వ ర్యాంక్ సాధించారు. వాళ్లే సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్. వీరిద్దరూ అన్నదమ్ములు కాదు. కానీ సమన్వయంతో విజయాలు సాధిస్తున్నారు. ఇద్దరి స్వస్థలం చండీగఢ్. ఇద్దరూ ఐఐటి ఢిల్లీలో బీటెక్ చదివారు. అమేజాన్ లో ఉద్యోగం చేశారు. ఆ స్ఫూర్తితో తాము కూడా ఇ-రిటైల్ కంపెనీని స్థాపించాలని నిర్ణయించారు. అమేజాన్ ఉద్యోగానికి టాటా చెప్పారు.
వీరిద్దరూ కలిసి 4 లక్షల పెట్టుబడితో ఫ్లిప్ కార్టను బెంగళూరు కేంద్రంగా స్థాపించారు. భారతీయ ఆన్ లైన్ రిటైల్ సంస్థల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారు. వీరి వ్యాపార దక్షత వల్ల అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది. దీంతో పలు కంపెనీలు మిలియన్లకొద్దీ పెట్టుబడులు పెట్టాయి. అలా ఫ్లిప్ కార్ట్ బయటి బ్రాండ్లతో పాటు సొంత బ్రాండ్లను కూడా భారీ అమ్మే స్థాయికి ఎదిగింది. సచిన్ బన్సల్ వయసు 34 ఏళ్లు. బిన్నీ బన్సల్ వయసు 32 ఏళ్లు. అంటే, దేశంలో అత్యంత సంపన్నులైన మొదటి వంద మందిలో అతి చిన్న వయస్కుడు బిన్నీయే. అన్నట్టు వీరిద్దరి సంపద చెరి 1.3 బిలియన్ డాలర్లని ఫోర్బ్స్ లెక్కగట్టింది. ఆత్మ విశ్వాసం, పక్కా ప్లానింగ్, రిస్క్ తీసుకునే ధైర్యం ఉంటే ఎంత ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చో ఈ యువ్ బిలియనీర్లే ఉదాహరణ. భారతీయ యువతలో ప్రతిభకు కొదువ లేదు. వారికి అవకాశాలు కల్పిస్తే, లేదా వారే సొంతగా అవకాశాలు సంపాదిస్తే అద్భుతాలు సాధించగలరు.
ధీరూభాయ్ అంబానీ వారసుడిగా ముకేష్ అంబానీకి లక్ష కోట్లకు పైగా సంపద వారసత్వం కింద వచ్చింది. ఆ సంపదను ఆయన మరింత పెంచుతున్నారు. దేశంలో నెంబర్ వన్ సంపన్నుడిగా పేరు పొందారు. కానీ, జీరో నుంచి బిలియనీర్ల స్థాయికి ఎదిగిన సామాన్య కుటుంబాల యువకులు అంబానీ కంటే రియల్ రిచెస్ట్ అంటూ చాలా మంది యూత్ ఫేస్ బుక్ లో పోస్టింగ్స్ చేస్తున్నారు. అంబానీతో పోటీయా కాదా అనేది వేరే సంగతి. ఎవరు ఔనన్నా కాదన్నా అంబానీయే నెంబర్ వన్. కానీ ఈ యువకుల విజయం మరింత మందికి స్ఫూర్తినిచ్చే అవకాశం ఉంది.