2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చారు పవన్ కల్యాణ్. ఆ తరవాత ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, ఆ వెంటనే పాలనా పరమైన కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల సినిమాలకు ఇచ్చిన బ్రేక్ అలానే కొనసాగుతూ వచ్చింది. అక్టోబరు నుంచి మళ్లీ మేకప్ వేసుకొని, కెమెరా ముందుకు రావాలని, పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోయిన సినిమాల్ని ఒడ్డున చేర్చాలని పవన్ భావించారు. తన నిర్మాతల్నీ, దర్శకుల్ని ఆఫీసుకు పిలిపించుకొని మాట్లాడారు. షెడ్యూల్స్ కూడా ఖాయం చేసేశారు. అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ మూడు నెలల్లో మూడు సినిమాలకు కాల్షీట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. నెల రోజుల ముందు మళ్లీ ఫిట్‌గా ఉండడానికి కసరత్తులు కూడా మొదలెట్టాలని అనుకొన్నారు. పవన్ మళ్లీ వస్తాడని, ఆయన సినిమాలు మళ్లీ పట్టాలెక్కుతాయని నిర్మాతలతో పాటు అభిమానులు కూడా సంబరాలు చేసుకొన్నారు.
అయితే పవన్ స్పీడుకు వరదలు బ్రేక్ వేశాయి. ఏపీ ప్రస్తుతం వర్షాలు, వరదలతో అల్లాడిపోతోంది. డిప్యూటీ సీఎంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల బాబోగులు చూసుకోవాల్సిన బాధ్యత పవన్‌పై ఉంది. ఆయన గత కొద్ది రోజులుగా శాఖాపరమైన పనుల్లో బిజీ అయిపోయారు. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కార్యాలయంలోనే అధికారులతో గడుపుతున్నారు. ఇప్పుడు పిఠాపురం బయల్దేరారు. అక్కడ వరద ముప్పు ఉందని గ్రహించి, తన నియోజకవర్గ ప్రజలకు అండదండగా ఉండడానికి కంకణం కట్టుకొన్నారు. ఈ పరిస్థితులన్నీ సద్దుమణగడానికి ఎన్నిరోజులు పడుతుందో చెప్పలేం. ప్రజా జీవనం మళ్లీ యధాస్థానానికి వచ్చేంత వరకూ పవన్ దృష్టి సినిమాలపై ససేమీరా ఉండదు. కాబట్టి పవన్ కోసం సిద్ధం చేసుకొన్న షెడ్యూల్స్ కూడా అతలాకుతలం అవ్వక తప్పదు. పవన్ నిర్మాతలు కూడా ఈ విషయాన్ని పెద్ద మనసు చేసుకొనే ఆలోచిస్తున్నారు. పవన్‌పై నిర్మాతల వైపు నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదు. పవన్ అన్ని విధాలా సిద్ధంగా ఉన్నప్పుడే షూటింగులు మొదలవుతాయని, అప్పటి వరకూ ఎదురు చూస్తుంటామని దర్శకులు కూడా చెబుతున్నారు.