వర్షాకాలం వస్తుందంటే ఏ ప్రభుత్వమైనా కాస్త సన్నాహా చర్యలు తీసుకుంటుంది. ప్రాజెక్టులు ఉన్న చోట ముంపు గురించి.. ఇతర అంశాల గురించి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇది చేయడానికి ముఖ్యమంత్రులు ఆదేశాలు ఇవ్వాల్సిన పని లేదు. అధికార విధుల్లో రొటీన్ ప్రక్రియ ఇది. కానీ గోదావరికి వచ్చిన వరదతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నాయి. గత మూడేళ్ల నుంచి పడుతున్న ఇబ్బందులే. వరద వచ్చినంత కాలం నీళ్లలో నానుతున్నారు. వరద పోతోంది. మళ్లీ సైలెంట్ అవుతున్నారు. ప్రభుత్వమూ అంతే. పట్టించుకోవడం లేదు.
ఈ సారి మరీ వరద ఎక్కువగా వచ్చింది. జూలైలోనే పెద్ద ఎత్తున వరద రావడంలో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. నిజానికి భూసేకరణ మినహా ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ కనీసం ముందుకు కదలడం లేదు. దీంతో వరదల కారణం ఎప్పటికప్పుడు డ్యామేజ్ అవుతోంది. తాజాగా కాఫర్ డ్యాం కూడా దెబ్బతిన్నదన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ముంపు గ్రామాలు తీవ్ర ఇక్కట్లలో పడ్డాయి. కోనసీమ మొత్తం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం మాత్రం వందేళ్లలో రానంత వరద వచ్చిందని అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పుకొస్తోంది. కడప లో వరదలు వచ్చినప్పుడుకూడా ఇదే చెప్పారు. అక్కడి జనం ఇప్పటికీ టెంట్లలో గడుపుతున్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకెళ్తే ఇంత వరకూ బాధితులకు కనీసం పక్కా ఇళ్లను కూడా నిర్మించలేదు. అప్పుడు చెప్పినట్లే ఇప్పుడు గోదావరి వరదలకు కూడా వందేళ్ల రికార్డు వర్షాలు కారణం అని చెబుతున్నారు. కానీ ప్రజల్ని ఆదుకునేందుకు మాత్రం చురుకుగా లేరు.
ప్రజలకు కావాల్సింది కారణాలు కాదు పరిష్కారాలు. కారణాలు ఎవరైనా చెబుతారు. కానీ ప్రజల్ని ఆదుకున్నోడే పాలకుడు. ఎలాంటి పరిస్థితులనైనా ఊహించి ప్రజల్ని కాపాడాలి. అలా చేయకుండా ఊహించనంత వరద వచ్చింది.. ప్రకృతి విపత్తు అంటూ ఎవరికి వారిని గాలికొదిలేసి తాము మాత్రం చల్లగా కూర్చుంటే ప్రజలిచ్చిన పీఠానికి విలువ ఉండదు. దురదృష్టవశాత్తూ ఏపీలో అదే జరుగుతోంది.