ఆంధ్రప్రదేశ్‌లో 2022 సంవత్సరం మొదటి 7 నెలల్లో భారతదేశానికి పారిశ్రామిక పెట్టుబడుల్లో రూ.40,361 కోట్లు ఏపీకి వచ్చాయట. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) వెల్లడించిందని ఢిల్లీ స్థాయిలో ఏపీ ప్రభుత్వం మెయిన్‌టెయిన్ చేస్తున్న పీఆర్ టీం గొప్పగా అన్ని మీడియాలకు సమాచారం ఇచ్చింది. ఏపీ ప్రభుత్వంతో కొన్ని ఆర్థిక పరమైన ప్రయోజనాలు పొందుతున్న మీడియాలు ప్రముఖంగా ప్రచురించాయి. అయితే ఆ మీడియాలన్నీ ఎక్కడా తాము ధృవీకరించలేదు. ఏపీ సర్కార్ చెప్పందంటూ రాసుకొచ్చాయి.
పెట్టుబడులు ఎప్పుడొచ్చాయ్.. ఎలా వచ్చాయ్ ?
అంత వరకూ బాగానే ఉన్నా.. అసలు డీపీఐఐటీ వెబ్సైట్లో రికార్డులను పరిశీలిస్తే.. ఎక్కడా అంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చినట్లుగా లేదు కనీసం ప్రతిపాదనలు వచ్చినట్లుగా కూాడ లేదు. జూన్ వరకూ ఐదువేల కోట్లకు కొద్దిగా ఎక్కువగా పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లుగా రిపోర్టు ఉంది. అసలు నిజంగా ఏపీకి అన్నివేల కోట్ల పెట్టుబడులు వస్తే ఏపీ ప్రభుత్వం డీపీఐఐటీ ప్రకటించేదాకా ఊరుకుంటుందా ? ఉదరగొట్టేయదరూ.. కనీసం వారం రోజల పాటు ఫుల్ పేజీ ప్రకటనలు.. జగన్ కు పెట్టుబడుల వీర – పారిశ్రామిక ధీర అనే పేరుతో వీర తాళ్లు వేయడం ఎప్పుడో జరిగి ఉండేది. కానీ అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రం చెప్పిందని మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు.
మాగంటి, సాగర్ సాఫ్ట్ వేర్ కంపెనీలు అందులోని పెట్టుబడులేనా ?
విచిత్రంగా కేంద్రం ప్రకటించినట్లుగా చెబుతున్న డీపీఐఐటీ రిపోర్టు గురించి జాతీయ మీడియాలో చెప్పుకోవడానికి ముందు .. ఏపీలో భారీ ఐటీ కంపెనీలు విశాఖకు వస్తున్నాయంటూ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఓ గ్రాఫిక్స్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో మాగంటి సాఫ్ట్ వేర్.. సాగర్ సాఫ్ట్ వేర్.. అంటూ సూట్ కేసు కంపెనీలు ఉన్నాయి. ఊరూ పేరూలేని కంపెనీలతో ఇచ్చిన ఆ ప్రకటన చూసి.. వాటి అడ్రస్‌లు ఎక్కడున్నాయి.. వాటిలో ఎంత మంది పని చేస్తారు.. లాంటి వివరాలు.. ఫోటోలు మొత్తం నెటిజన్లు సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ ఓ రేంజ్లో ఉంది. గత ఏడు నెలల్లో వచ్చిన నలభై వేల కోట్ల పెట్టుబడుల్లో భాగం ఇవేనా అని సెటైర్లు కూడా పడుతున్నాయి.
ఏడు నెలల్లో ఏపీకి ఎక్కడ పరిశ్రమలు వచ్చాయి ?
గత ఏడు నెలల్లో ఏపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క పెట్టుబడి నిజమనది వచ్చిందని చెప్పలేదు. పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయంటూ ఇటీవల రూ.1,26,748 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అవన్నీ ఇప్పటికే పెడతామని చెప్పిన కొన్ని కంపెనీలు కాగా.. వేల కోట్ల పెట్టుబడి పెడతామన్న కంపెనీలకు సరైన అడ్రస్‌లు కూడా లేవని తేలింది. ఇంతకు మించి.. గత ఏడు నెలల్లో నలభై వేల కోట్లు వచ్యాయని.. ఫలానా చోట పెట్టుబడి పెట్టారని కానీ ఎక్కడా చెప్పలేదు. మరి కేంద్రం ఎలా చెప్పింది ? ఎక్కడ చెప్పింది ? ఎలా జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారు ? ఇవన్నీ సందేహాస్పద విషయాలు. పైగా ఎప్పుడో తెలుగు360కి సలహాదారు రాజీవ్ కృష్ణ సవాల్ చేసిన రూ.50 కోట్ల పెట్టుబడి ఇప్పటికీ గ్రౌండ్ కాలేదు. సవాల్ చేసినా తేలుకుట్టిన దొంగలా సైలెంట్‌గా ఉండిపోయారు.
ఇమేజ్ కోసం తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారా?
కొసమెరుపేమిటంటే… ఈ పెట్టుబడుల ప్రవాహం గురించి ఏపీలో ప్రచారం చేసుకుంటే నవ్వుకుంటారని అనుకుంటున్నారేమో కానీ ఎక్కువగా …, జాతీయ మీడియా.. అంటే ఇంగ్లిష్ , హిందీ మీడియాలోనే ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకో మరి !