వర్షకాలం మొదలైంది. వానలు జాడలేవు… రెండు నెలల కాలం గడుస్తున్నా, వరి నాట్లు ఊపందుకోలేదు. జలాశయాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈసారి కాలం కానట్లేనా అని కండ్లలో వత్తులేసుకొని ఎదురుచూస్తున్న తరుణంలో… రైతులకు శుభవార్త.
వర్షాకాలం మొదలై రెండు నెలలు అవుతుంటే… ఇప్పుడు కృష్ణానదికి వరద మొదలైంది. కర్నాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నారాయణపేట జలాశయంకు వరద పోటేత్తింది. 129టీఎంసీలు నిల్వ సామర్థ్యం ఉన్న నారాయణపేట జలాశయంలో ఇప్పటికే 105టీఎంసీల నీరుంది. పై నుండి భారీగా వరద వస్తుండటంతో… దాదాపు 65వేల క్యూసెక్కుల నీరును కిందకు వదులుతున్నారు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది.
నారాయణపేట జలాశయం నుండి ఆల్మట్టికి వరద భారీగా వస్తుంది. ఆల్మట్టి నుండి కూడా కిందకు క్రమంగా నీరు వదులుతున్నారు. ఆల్మట్టి నుండి కిందకు నీరు వదిలితే జూరాలకు, శ్రీశైలంకు చేరుకుంటుంది. రాబోయే రోజుల్లో భారీగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్ర సమాచారంతో పాటు ఇప్పటికే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జురాల-శ్రీశైలంకు భారీగా వరద పోటేత్తే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానదిపై ఉన్న రిజర్వాయర్లు అన్నీ డెడ్ స్టోరేజ్ లోనే ఉన్న నేపథ్యంలో… వరద వస్తే రైతులకు భారీ ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది.
ఇటు గోదావరిపై కూడా ఇప్పటి వరకు ఆశించినంత వరద రాలేదు. కానీ క్రమంగా గోదావరిలో కూడా వరద పెరిగే అవకాశం కనపడుతోంది. గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ వద్ద స్టోరేజ్ కు అవకాశం లేకపోవటంతో అప్పర్ గోదావరిపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నారు.