కొన్ని సినిమాలంతే. వెండి తెరపై చూస్తున్నప్పుడు ఒకలా ఉంటాయి. ఇంట్లో టీవీలో చూస్తున్నప్పుడు మరోలా కనిపిస్తాయి. ‘సినిమా బాగానే ఉంది కదా.. ఎందుకు ఆడలేదో’ అనే అనుమానాలు వస్తాయి. ఇంకొన్ని వెండి తెరపై డిజాస్టర్ ని మూటట్టుకుని, టీవీల్లో తెగ ఆడేస్తుంటాయి. అలాంటి సినిమాలెన్నో.. ఎన్నెన్నో.
త్రివిక్రమ్ సినిమాలనే తీసుకోండి. థియేటర్ రిజల్ట్ ఎలా ఉన్నా, బుల్లి తెరపై తెగ ఆడేస్తుంటాయి. ఖలేజా ఫ్లాప్. కానీ.. టీవీలో ఎప్పుడు వచ్చినా, జనం చూస్తూనే ఉంటారు. జెమినీ టీవీ వాళ్లకు హయ్యస్ట్ రేటింగు ఇచ్చే సినిమాల్లో ఇదొకటి. సన్నాఫ్ సత్యమూర్తి కూడా కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. కానీ.. టీవీ తెరపై అది సూపర్ హిట్టు. దీనిపై త్రివిక్రమ్ కూడా చాలాసార్లు స్పందించాడు. ”థియేటర్ లో చూసినప్పుడు కంటే టీవీల్లో చూసినప్పుడే మీ సినిమాలు బాగుంటాయి అంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. అంటే.. నేను టీవీలో చూడ్డానికి పనికొచ్చే సినిమాలు మాత్రమే తీయగలనా అనే అనుమానం వేస్తోంది” అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
బోయపాటి శ్రీను సినిమాలకూ మంచి టీఆర్పీలే వస్తుంటాయి. తన సినిమా `దమ్ము` ఫ్లాప్. కానీ… టీవీలో అది హిట్టు. మొన్నటికి మొన్న తీసిన `వినయ విధేయ రామా` కూడా టీఆర్పీ రేటింగులను బద్దలు కొట్టింది.రిపీట్ మోడ్ లో ఈ సినిమా వస్తున్నా – జనం చూస్తూనే ఉన్నారు. నాగచైతన్య సవ్యసాచి, అఖిల్ మజ్ను సినిమాలకూ వాటి థియేటరికల్ రిజల్ట్కీ, టీఆర్పీ రేటింగులకూ సంబంధమే లేదు. ఈ రెండు సినిమాల్నీ.. హిందీలో డబ్ చేస్తే… లక్షల మంది చూశారు, చూస్తున్నారు. తెలుగులో ఫ్లాప్ అయిన యాక్షన్ సినిమాలకు సైతం హిందీ డబ్బింగులకు మంచి వ్యూస్ వస్తున్నాయి. అందుకే.. హిందీ డబ్బింగ్ రైట్స్రూపంలో మన నిర్మాతలకు మంచి రేట్లు గిట్టుబాటు అవుతున్నాయి. లాక్ డౌన్ సమయం ఇది. టీవీ, లాప్ టాప్ మినహాయిస్తే.. మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయాయి. అందుకే.. ఫ్లాప్ సినిమాల్నీ తెగ చూస్తున్నారు అనుకోవాలో.. లేదంటే – థియేటర్ రిజల్ట్ కీ టీఆర్పీలకూ అస్సలు సంబంధం ఉండదని అనుకోవాలో.. ఇదో ఫజిల్గా మారింది.