జూలై 1, 2016. ఇది భారత వాయుసేన చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైన సుదినం. దాదాపు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తేజస్ యుద్ధ విమానాలు నేటి నుంచి వాయుసేనలో చేరబోతున్నాయి. తేజస్ యుద్ధ విమానాలతో ‘ఫ్లైయింగ్ డేగర్స్-45’ అనే పేరుతో ఈరోజు భారత వాయుసేనలో ఒక ప్రత్యేక స్క్వాడర్న్ (విభాగం) ఏర్పాటు చేస్తున్నారు. కేవలం రెండు తేజస్ విమానాలతో మొదలవుతున్న ఈ ఫ్లైయింగ్ డేగర్స్-45 విభాగం మొదటి దశలో 20 విమానాలు, తరువాత దశలో మరో 20 విమానాలను సమకూర్చుకోబోతోంది. ఈరోజు ఏర్పాటు అవుతున్న ఈ తేజస్ ప్రత్యేక విభాగం బెంగళూరు కేంద్రంగా రెండేళ్ళపాటు పని చేస్తుంది. ఈ రెండేళ్లలో అది పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ కి సిద్దం అయిన తరువాత తమిళనాడులోని సులూర్ కి తరలించబడుతుంది. అప్పటి నుంచి తేజస్-ఫ్లైయింగ్ డేగర్స్-45 విభాగం అదే ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.
ఈ యుద్ధవిమానాలు వాయుసేనలోకి నేడు చేరడానికి దాదాపు 46 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్తానం చేయవలసి వచ్చింది. యుద్ధ విమానాలు, పరికరాల కోసం పూర్తిగా విదేశాల మీదనే ఆధారపడటం వలన దేశానికి ఆర్ధికంగా పెనుభారంగా మారడమే కాకుండా, చాలాసార్లు అనేక అవరోదలు ఎదుర్కోవలసి వస్తోంది. అందుకే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మనమే యుద్ధ విమానాలు చేసుకొంటే ఎలాగ ఉంటుందనే ఆలోచన ప్రభుత్వానికి కలిగింది. 1970లో కలిగిన ఆ ఆలోచన కార్యరూపంలో మారడానికి ఒకటి రెండూ కాదు ఏకంగా 16 సం.లు పట్టింది. అప్పటి నుంచి ప్రభుత్వాలు మారుతుంటే వాటి ఆలోచనలు, ప్రాధాన్యతలు కూడా మారుతుండేవి. ఆ సమస్యలని అధిగమించిన తరువాత ఆర్ధిక, సాంకేతిక సమస్యలు, అనేక ఇతర అవరోధాలు అన్నీ దాటుకొంటూ చివరికి ఇన్నేళ్ళ తరువాత భారత్ లో నిర్మితమైన రెండు తేజస్ యుద్ధ విమానాలు భారత వాయుసేనలో చేరడం, వాటితో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ యుద్ద విమానాలు పూర్తి స్థాయిలో విధులు నిర్వహించడానికి మరొకటి రెండేళ్ళు వరకు పట్టవచ్చని తెలుస్తోంది. ఈలోగా మరికొన్ని తేజస్ విమానాలు కూడా వచ్చి చేరుతాయి. ఈ విమానాలు తక్కువ బరువుతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడ్డాయి. పాకిస్తాన్ కోసం చైనా తయారుచేసి ఇస్తున్న జెఫ్-17 యుద్ద విమానాల కంటే ఇవి ఆధునికమైనవి, చాలా శక్తివంతమైనవని నిపుణులు చెపుతున్నారు. రానున్న రోజుల్లో మిగ్-21 యుద్ద విమానాల స్థానాన్ని ఇవి భర్తీ చేయాలని వాయుసేన భావిస్తోంది.
ఆసియా ఖండంలో భారత్ ని తిరుగులేని శక్తివంతమైన దేశంగా తీర్చి దిద్దాలని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకి అనుమతించారు కనుక ఈ తేజస్ మూడవ దశలో తయారు చేయబడే 40 యుద్ధ విమానాలు మొదటి రెండు దశలలో తయారైనవాటి కంటే కూడా ఇంకా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శక్తివంతమైనవిగా రూపొందించబడే అవకాశం ఉంటుంది.