ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి మంత్రి పదవులపై పడింది. దానికి కారణం .. మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ..కేబినెట్లో చోటు దక్కించుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నిక కావడమే. రాజ్యసభకు ఎన్నికయినందున వారు శాసనమండలి సభ్యత్వంతో పాటు.. మంత్రి పదవులకు కూడా రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో ఇప్పుడు ఆ రెండు మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయన్న చర్చ వైసీపీలో ప్రారంభమయింది. ఇద్దరు బీసీ మంత్రులు కావడంతో.. మళ్లీ బీసీ వర్గాలకే చాన్స్ ఇస్తారని చెబుతున్నారు.
నిజానికి జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌ను ఏర్పాటు చేసేటప్పుడే… మంత్రులందరికి ఓ మాట చెప్పారు. పదవి కాలం రెండున్నరేళ్లు మాత్రమేనని.. తర్వాత 80 శాతం మందిని మార్చేస్తానని ప్రకటించారు. దాంతో.. కనీసం రెండున్నరేళ్ల తరవాత అయిన తమకు చాన్స్ వస్తుందని… పార్థసారధి దగ్గర్నుంచి రోజా వరకూ.. సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు.. అనూహ్యంగా ఏడాది పూర్తవగానే.. రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని జగన్మోహన్ రెడ్డి వెంటనే భర్తీ చేస్తారని భావిస్తున్నారు. ముందుగా చెప్పిన దాని ప్రకారం.. మరో ఏడాదిన్నర వరకూ ఆ రెండు పదవుల్ని ఖాళీగా ఉంచబోరని భావిస్తున్నారు. ఈ రెండు పదవుల కోసం.. వైసీపీలో తీవ్రమైన పోటీ నెలకొంది. భర్తీ మాత్రం అనేక సమీకరణాలతో ముడి పడి ఉంది. ఏ జిల్లాల నుంచి రాజీనామా చేయించారో అదే జిల్లాల నుంచి అదే వర్గాల నుంచి పదవులకు ఎంపిక చేస్తే ఇబ్బంది రాదు. కానీ.. అలాంటి పరిస్థితి లేదు. ఇతర జిల్లాల వారికి చాన్సివ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే.. జిల్లాల మధ్య మంత్రి పదవుల సమతూకం దెబ్బతింటుంది. మొత్తం కవర్ చేయాలంటే.. పునర్ వ్యవస్థీకరణ చేయాలి. ఒక వేళ అలా చేస్తే… మొత్తం రచ్చ అవుతుంది. ఈ విషయాలన్నింటినీ వైసీపీ హైకమాండ్ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది.
నిజానికి రాజ్యసభకు ఎన్నికయినప్పటికీ.. మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఆరు నెలల పాటు మంత్రుగా ఉండవచ్చు. రాజ్యసభలో సభ్యులుగా ప్రమాణం చేసే నాటికి ఎమ్మెల్సీగా మాత్రం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఏ సభలోనూ సభ్యుడిగా లేకపోయినప్పటికీ.. ఆరు నెలలు మంత్రిగా ఉండే అవకాశం ఉంది. అయితే.. ముఖ్యమంత్రి జగన్ వారితో మంత్రులుగానూ రాజీనామా చేయించే అవకాశం ఉందంటున్నారు. గత కేబినెట్ సమావేశంలో పిల్లి, మోపిదేవిని ఉద్దేశించి..వారికిఇదే చివరి కేబినెట్ భేటీ అని వ్యాఖ్యానించనిట్లుగా ప్రచారం జరిగింది.