గతంలో జగన్ తన అక్రమాస్తుల కేసు దృష్ట్యా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావలసి వచ్చేది. అయితే జగన్ ముఖ్య మంత్రి అయిన తర్వాత శుక్రవారం వచ్చిందంటే ప్రత్యర్థులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సరిగ్గా శుక్ర వారం కోర్టు సమయం దాటిన తర్వాత – తనపై కానీ, తన పార్టీ పై కానీ విమర్శలు చేసిన ప్రతి పక్ష నేతలను ఏదో ఒక కారణంతో జైలుకు పంపడం, కొద్ది రోజులపాటు అయినా వారిని జైల్లో మగ్గేలా చేయడం, ఇటీవలి కాలంలో జగన్ రెడ్డి ప్రభుత్వంలో తరచుగా జరుగుతోంది. సొంత పార్టీ రెబెల్ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు నీ ఇదే విధంగా నిన్న అరెస్టు చేయగా జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దీనిని ఖండించారు. ఎంపీ అరెస్టు కి ఇది సమయం కాదని, ముందు కోవిడ్ రోగులను కాపాడడం పై దృష్టి సారించాలని ఆయన వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే..
జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంపీ రఘు రామ కృష్ణం రాజు ని అరెస్ట్ చేయడంపై స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఇలా పేర్కొన్నారు – ” ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కదిలించి ప్రజలను రక్షించవలసిన ఉండగా ఎంపీ రఘు రామ కృష్ణం రాజు ను అరెస్టు చేయడం ఏమాత్రం సమర్థింపు చర్య కాదని జన సేన భావిస్తోంది. ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు అనే కారణంతో సమయం, సందర్భం లేకుండా అరెస్టు చేయడాన్ని జన సేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఒక పక్క కరోనా సోకిన వారికి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క, ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా, అవసరమైన మందుల కోసం పది షాపులు వెతకవలసిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి . ప్రభుత్వ యంత్రాంగం ప్రజల బాధల పై దృష్టి పెట్టాలి. ఈ సమయం లో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి అరెస్టు చేయడం అప్రజాస్వామికం గా జన సేన భావిస్తోంది. ఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ నుంచి వైద్యం కోసం వెళుతున్న అంబులెన్స్‌లను పక్క రాష్ట్ర సరిహద్దుల్లో ఆపుతూ ఉంటే ఈ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది . చివరకు తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుంటే కానీ అంబులెన్సులు కదిలే పరిస్థితి రాలేదు. రాష్ట్రంలో ఏదో అద్భుతాలు సృష్టించి కరోనాని ఆపమని జనసేన కోరడం లేదు. వైద్య పరంగా అక్కడున్న వనరులు, వైద్య సిబ్బంది , ఇతరత్రా అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంది . ప్రత్యర్థి పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ ఎంపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇలాంటి సమయం లో సొంత పార్టీ ఎంపీ ని అరెస్టు చేయడం పై చూపించిన శ్రద్ధ ఏ విధంగా హేతుబద్ధమో వైసిపి ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. ఊరూరా కొల్లలుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయం భయంగా గడుపుతున్నారు . ప్రజల్లో మనో ధైర్యాన్ని నింపి, ఆక్సిజన్, మందులు, ఆసుపత్రుల్లో పడకలు అందేలా ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించాలని జనసేన విజ్ఞప్తి చేస్తోంది. కొంతకాలం పాటైనా రాజకీయ దమననీతి ని కట్టిపెట్టాలని డిమాండ్ చేస్తోంది.” ఇది పవన్ కళ్యాణ్ ప్రకటన.
నిజానికి ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు జనసేన పార్టీ తరపున పోటీచేసిన నాగబాబు పై చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసి ఉన్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ వాటిని దృష్టిలో పెట్టుకోకుండా, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన సొంత పార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణం రాజు ని రాజకీయ కక్ష సాధింపు లో భాగంగా అరెస్టు చేయడాన్ని పవన్ కళ్యాణ్ ఖండించడం పట్ల రఘురామకృష్ణంరాజు శ్రేయోభిలాషులు, అభిమానుల తో పాటు ఇతర వర్గాల నుండి కూడా సానుకూలత వ్యక్తం అవుతోంది.