భువనగిరి ప్రభుత్వ గురుకుల హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనలో విషాదం నెలకొంది. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఐదు రోజులుగా చికిత్స పొందుతోన్న ఓ విద్యార్ధి మృతి చెందాడు. ఈ నెల 12న భువనగిరి హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా పులిహోర తిన్న ప్రశాంత్ అనే విద్యార్ధితోపాటు 24మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా అందులో ప్రశాంత్ అనే విద్యార్ధి ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు.
పోస్ట్ మార్టం నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రి నుంచి ప్రశాంత్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ విద్యార్ధి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ కుమారుడి మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు. హాస్టల్ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి ఆందోళనలకు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంఘీభావం తెలిపారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.
మరోవైపు ప్రశాంత్ స్వగ్రామమైన పోచంపల్లి మండలం జిబ్లక్పల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. కుమారుడి మృతితో తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.కాగా, గురుకుల వసతి గృహాలలో విద్యార్థినిల ఆత్మహత్యల ఘటనలపై తీవ్ర దుమారం రేగుతుండగా… తాజాగా ఫుడ్ పాయిజన్ ఘటనలో విద్యార్ధి మృతి చెందటంతో హాస్టల్ సిబ్బందిపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.