కరోనా సమయంలో.. వైద్యులు చూపించిన తెగువ, ఫ్రంట్ లైన్ వారియర్స్ చేసిన పోరాటం.. ఎవరూ, ఎప్పటికీ మర్చిపోలేరు. కరోనాని ఎదురొడ్డి పోరాడారు. వైద్యులు ఎంతోమందికి ప్రాణాలు పోస్తే.. పారిశుద్య కార్మికులు, వైద్య సిబ్బంది, పోలీసులు – మరెన్నో రకాలుగా తమ సేవలు అందించారు. క్వారెంటైన్లో ఉన్న కరోనా రోగులలో స్ఫూర్తిని నింపడానికి… ఆసుపత్రి ఆవరణలో డాన్సులు చేసిన వైద్యుల వీడియోలు… సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సేవా నిరతికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం.
ఇప్పుడు నాని వీళ్లందరికీ తనదైన పద్ధతిలో థ్యాంక్స్ చెప్పబోతున్నాడు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం నాని ఓ వీడియోని రూపొందిస్తున్నాడు. దీన్ని త్వరలోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయబోతున్నాడు. అందుకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయ్యింది. నాని నటించిన `టక్ జగదీష్` సినిమా పూర్తయింది. విడుదలకు సిద్ధమైంది. అయితే… ఈ వీడియోకీ, టక్ జగదీష్ కీ ఏమాత్రం సంబంధం లేదు. ఇది కేవలం కరోనా వారియర్స్ కోసం మాత్రమే. “కరోనా వారియర్స్ కోసం సమ్ థింగ్ స్పెషల్ రాబోతోంది. అదేమిటో ఊహించండి“ అంటూ నాని ట్వీట్ చేశాడు. మరి ఆ స్పెషల్ గిఫ్ట్ లో ఏముందో?