భూములమ్మి సొమ్ము చేసుకునే పనిలో ఉన్న ఏపీ ప్రభుత్వం.. మొదటగా… విశాఖపట్నంపై గురి పెట్టారు. విశాఖపట్నం .. ఆ చుట్టుపక్కన ఉన్న పది మండలాల్లోని ప్రభుత్వ భూములను.. యుద్ధప్రాతిపదికన గుర్తించారు. ఇలా మొత్తంగా.. నాలుగు వేల ఎకరాలను అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా విశాఖకు పేరుంది. శరవేగంగా విస్తరిస్తున్న సిటీతో పాటు.. పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉండటం… తీర ప్రాంత నగరం కావడంతో.. అన్ని రకాల అనుకూలతలు ఉన్నాయి. విశాఖ సిటీ నుంచి కొత్తవలస వరకూ.. విస్తరించింది. విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో 13 మండలాలు ఉంటే వాటిలో పది మండలాల్లో.. విలువైన భూములను గుర్తించారు. వీటిలో నాలుగు వేల ఎకరాలను అమ్మకానికి సిద్ధం చేశారు.
గత ప్రభుత్వాలు.. విశాఖలో పారిశ్రామిక, ఐటీ రంగాలను అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున భూములను సేకరించిప ెట్టాయి. వీటిని ఇప్పుడు.. ఆదాయం కోసం… ప్రభుత్వం తెగనమ్మాలని నిర్ణయించుకుంది. గుర్తించిన భూములకు సంబంధించి సర్వే సంఖ్య, కోర్టు కేసులు, ఇతర అభ్యంతరాలపై అధికారులు తదుపరి కసరత్తు చేస్తున్నారు. తొలి దశలోనే ప్రభుత్వం విశాఖ భూముల్ని విక్రయించడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ పెద్దలు కూడా.. విశాఖ భూములపై ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తున్నారు. విజయసాయిరెడ్డి తన కార్యక్షేత్రంగా విశాఖనే ఎంచుకున్నారు.
విశాఖలో భూములు అమ్మి డబ్బులు సంపాదించాలనే కాన్సెప్ట్.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అమలు చేశారు. తొలి సారి ఆయన అధికారంలోకి వచ్చిన 2004లో హైదరాబాద్‌తో పాటు విశాఖలోనూ భూములను కూడా అమ్మారు. విశాఖ శివారు ప్రాంత మండలాల్లో భారీగా భూములు విక్రయించారు. అప్పట్లోనే ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల వరకు ఆదాయం సమకూరింది. అదే కాన్సెప్ట్‌లో ఆయన కుమారుడు కూడా రంగంలోకి దిగారు. ఈ సారి తండ్రిని మించి ఆయన ఎన్ని వేల కోట్ల ఆదాయాన్ని విశాఖ భూముల నుంచి సంపాదిస్తారో చూడాలి..!