హైదరాబాద్: రాజకీయ, సినిమా నాయకుల కోసం వీరాభిమానులు అనూహ్యమైన త్యాగాలు చేయటం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాము. ఈ విపరీత ధోరణి తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు ఆయన అభిమాని ఒకరు తన నాలుకను కోసుకున్నాడు. అదేకోవలో ఇప్పుడు కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని ఒకరు, సోనియాగాంధికోసం తన బొటనవేలిని కోసుకున్నారు.
కర్ణాటకలోని రామనగరానికి చెందిన సురేష్ అనే గ్రానైట్ వ్యాపారి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా సోనియా, రాహుల్ గాంధిలకు వీరాభిమాని. సోనియాగాంధి, రాహుల్ గాంధిలకు నేషనల్ హెరాల్డ్ కేసులో జైలు శిక్ష పడుతుందేమోనని అతను తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. అయితే ఎట్టకేలకు వారికి బెయిల్ లభించినందుకుగానూ ఆనందించి తిరుమల వెంకటేశ్వరస్వామికి గతనెల 25న తన బొటనవేలిని కానుకగా ఇచ్చారు. ఆ వేలిని ఒక వెయ్యిరూపాయల నోటులో చుట్టి, దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖరాసి వెంకన్న హుండీలో వేశారు. తర్వాత పక్కనే ఉన్న హాస్పిటల్‌కు వెళ్ళి చికిత్స చేయించుకున్నారు. ప్రమాదవశాత్తూ వేలు తెగిపోయిందని డాక్టరుకు చెప్పారు. ఈ విషయాన్ని ఆ పని చేసిన తర్వాతే తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కన్నడ నటుడు, కాంగ్రెస్ నాయకుడు, కర్ణాటక రాష్ట్ర మంత్రి అంబరీష్‌కు కూడా సురేష్ అభిమాని. సురేష్ గురించి తెలుసుకుని అంబరీష్ అతనిని తన ఇంటికి పిలుచుకుని మాట్లాడారు. ఆందోళన తెలియజేయాలనుకుంటే పాదయాత్రగానీ, మరో మార్గం గానీ ఎంచుకోవాల్సిందంటూ సురేష్‌ను మందలించారు.