తము కొన్న భూమిపై కోట్లలో లాభాలు సంపాదించడం కోసమే ఒక రాష్ట్ర మంత్రి, మరో కేంద్ర మంత్రి పట్టుపట్టి రాజధానిని అమరావతికి తరలించారని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ప్రజా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. రాజధాని డిజైన్ల పేరిట హడావుడి జరుగుతున్నప్పుడు ఆయన ఈ మాటలనడం విశేషం. విజయవాడ చుట్టుపక్కల వందల ఎకరాల భూమి అందుబాటులో వుందేది. ఇప్పటికే ప్రసిద్ధికెక్కిన పట్టణాలను నగరాలను ఆధారం చేసుకుని రాజధానిని కట్టుకుని వుంటే ఎప్పుడో పూర్తయ్యేది. కాని అమరావతి అంటూ బయిలు దేరారు. అక్కడ ఎ టు జెడ్ సమకూర్చుకోవలసిందే కదా.. అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. మాకే కాదు ముఖ్యమంత్రికీ తెలియదు. చెరో రెండు వందల ఎకరాలు ముందుగానే తీసుకున్న ఆ కేంద్ర మంత్రి, ఆ రాష్ట్ర మంత్రి మాత్రమే దీనివల్ల లాభపడాలనుకున్నారు. ఎకరాకు కోటి లాభం వస్తుందనుకుందాం. దానికోసం ఇంత కక్కుర్తి పడాలా అని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. నిజంగా అక్కడ అభివృద్ధి జరిగి అందరూ సంతోషించాలంటే ఎంత కాలం పడుతుందో ఎవరికీ తెలియదని ఏదో విధంగా మురిపించడం కోసం ఇప్పుడు ఎక్కువ కష్టపడాల్సి వస్తున్నదని ముఖ్యమంత్రికి దగ్గరగా మెలిగే ఆ నేత వాపోయారు. నారాయణకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలో ఇస్తున్నారో ఒక్కరికైనా అర్థం కాదని వ్యాఖ్యానించారు. ఆ ఇద్దరు చెప్పిన మాటలు నమ్మిన చంద్రబాబు కూడా అనేక విధాల ప్రయోజనం కలుగుతుందనే ఆశతో భూ సమీకరణ వంటివన్నీ పూర్తిచేసి అమరావతిలోచిక్కుకుపోయారని, ఎన్నికలలోగా ఏదో జరిగినట్టు చూపించడం ఏమంత తేలిక కాదని స్పష్టం చేశారు.