ఒడిస్సాలో ఒకటి, రెండు ప్రాజెక్టులు ప్రారంభించాలని ఆప్రభుత్వం హైదరాబాద్ లో విశాఖలో వున్న ఒక కంపెనీ ని ఆహ్వానించింది. ఈ కంపెనీ ప్రతినిధులు 3 నెలలు అధ్యయనం చేసి ఆప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇచ్చినా కూడా ఒడిస్సా ప్రజల కొనుకోలు శక్తులు తక్కువ కావడం వల్ల ప్రాజెక్టు వయబుల్ కాదని తేల్చేశారు. అయినా ఒడిస్సా ప్రభుత్వం ఈ కంపెనీ ప్రాజెక్టులు వస్తున్నాయని తన అవసరానికి ప్రకటిస్తూనే వుంది. ప్రభుత్వానికీ కంపెనీకి మధ్య షరతులు కుదిరితే పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమే ఎంఒయు రాసుకున్నారు. ఎంఒయు వున్నమాట నిజమే. షరతులు కుదిరితేగాని పరిశ్రమరాదు. ప్రజల కొనుగోలు శక్తులు పెరిగితేగాని షరతులు కుదరవు. పరిశ్రమలపై రాజకీయవేత్తలు ప్రచారం చేసేదానికీ వాస్తవ వాణిజ్యానికీ మధ్య తేడా గురించి చెప్పడానికే ఉదాహరణ.
సిఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ)ఆధ్వర్యంలో మూడురోజుల పాటు విశాఖలో జరిగిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు ఫలితాలు కూడా కూడా ఆశించినట్టు వుండవు అని చెప్పడానికే ఉదాహరణ. 41 దేశాలు పాల్గొన్న ఈ సదస్సులో కేవలం 10 కంపెనీలే పెట్టుబడులు పెట్టడానికి ముందుకి వచ్చాయి. వారు చెప్పిన 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో 20 శాతం వచ్చినా కూడా గొప్ప విషయం అంటున్నారు. ”ఇది మోదీ లోపమో బాబు లోపమో కాదు దేశ ఆర్ధిక స్ధితి బాగోలేకపోవడమే” కారణం అంటున్నారు ఆర్ధిక విశ్లేషకులు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక స్ధితిగతుల్ని చర్చిస్తున్నారు.
భారత్ దేశంల దేశం గడచిన 12 నెలల నుంచి ఎగుమతులు 20 శాతానికి తగ్గిపోయాయి. తయారీ రంగం వృద్ధి రేటు 3 శాతానికి పడిపోయింది. జిడిపికి ఈ రంగం 24 శాతం ఆదాయాన్ని సమకూర్చుతుంటే, ఇందులో 20 శాతం మందికి మాత్రమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. అలాగే వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 1 శాతానికి పడిపోయింది. భారత దేశంలో పంట భూమి తగ్గిపోవడం వలన వ్యవసా య ఉత్పత్తులు తగ్గిపోయి, ఆహార భద్రత సమస్య తలెత్తేలా ఉంది. జిడిపికి 17 శాతం ఆదాయాన్ని అందిస్తున్న ఈ రంగంలో 50 శాతం మంది పనిచేస్తున్నారు.
ఇక జిడిపికి 58 శాతం ఆదాయాన్ని అందిస్తున్న సేవా రంగంలో 30 శాతం మంది పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల సేవా పన్నును గణనీయంగా పెంచడం వలన, వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతానికైతే ఈ రంగం నుంచి భారీగా ఆదాయం వస్తూంది. మన దేశం ఆర్థికంగా బలంగా వున్నట్టు ప్రపంచానికి చూపించడానికి ఈ అంకెలే ఉపయోగపడుతున్నాయి. అంకెలు ఘనంగా వున్నాకూడా వాణిజ్యంలో భారత్ ప్రపంచంలో 130వ స్థానంలో ఉండడం గమనార్హం. భారత్ పరిస్థితికి ఈ ర్యాంక్ ఒక నిదర్శనం. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్ని కార్పొరేట్లు ముందుకు వస్తారన్నది ప్రశ్నే!
ఉత్పత్తి, ఎగుమతి రంగాల్లో ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. చైనా యువాన్ మారకం విలువను తగ్గించుకుని విదేశాలకు ఎగుమతులను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నా ఫలితాలు కనిపించడం లేదు. చైనా పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయగా, ఇప్పుడు అవి ఎందుకూ కొరగాకుండా పోయాయంటున్నారు.
చైనా ఆర్థిక వ్యవస్థ ఇంతగా కుదేలైపోడానికి కారణం బిలో పావర్టీలైన్ జనాభా అధికం గా ఉండడమేనంటున్నారు. ఆ దేశ స్టాక్ మార్కెట్లూ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయ.
ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్లోకి డిమాండ్‌కు మించి సరఫరా జరగడంతో ముడి చమురు ధరలు దారుణంగా క్షీణించాయ. గతంలో 140 డాలర్లు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం దాదాపు 30 డాలర్లు వుంది. అంటే భారత్‌లో ఒక మినరల్ వాటర్ బాటిల్ ధర కన్నా తక్కువ ధరకు లీటరు క్రూడ్ ఆయిల్ వచ్చేస్తోందన్నమాట. అలాగే పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, శ్రీలంక, నేపాల్, తదితర దేశాలు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయి. ఈ దేశాలు కూడా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాలదీ ఇప్పుడిదే పరిస్థితి. ప్రపంచమంతా ఆర్ధిక ఒడిదుడుకుల్లో వున్న ప్రస్తుత స్ధితిలో భారత్ కు విదేశీ పెట్టుబడులు ఏ మేరకు వస్తాయన్నది అనుమానమే!