విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల ప్రణాళికాల్లో ఏపీ పేరును శాశ్వతంగా కొట్టేశారు. ఈ విషయం ప్రత్యక్షంగా గణాంకాల్లో కనిపిస్తోంది. భారతదేశంలో విదేశీ పెట్టుబడిదారులు తమ వ్యాపారాలు, సంస్థలను ప్రారంభించడానికి 2019 నుంచి మూడేళ్ల కాలంలో దాదాపుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలను వెచ్చించారు. భారత దేశం మొత్తం మీద ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ పెట్టుబడులు పెట్టారు. ఇన్ని లక్షల కోట్లలో ఏపీలో పెట్టిన పెట్టుబడులు ఎంతో తెలుసా.. కేవలం నాలుగు వేల కోట్లు. అంటే మొత్తం పెట్టుబడుల్లో అర శాతం కూడా లేదు. పాయింట్ మూడు శాతం మాత్రమే. కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం ఈ వివరాలను వెల్లడించింది.
మొత్తం పెట్టుబడుల్లో రూ.3.29 లక్షల కోట్లతో మహారాష్ట్ర మొదటి స్థానంలో, రూ.2.73 లక్షల కోట్లతో కర్ణాటక రెండో, రూ.2.27 లక్షల కోట్లతో గుజరాత్ మూడో రూ.1.48 లక్షల కోట్లతో దిల్లీ నాలుగో స్థానాల్లో నిలిచాయి. ఎడారి ప్రాంతంగా ఉన్న రాజస్థాన్.. చిన్న రాష్ట్రం ఝార్ఖండ్ కూడా విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు వరుసలో ఉన్నాయి. రాష్ట్రం 14వ స్థానంలో నిలిచింది. అదే తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. ఏపీకి వచ్చిన ఆ నాలుగు వేల కోట్లు తెలుగుదేశం పార్టీ హయాలో చేసుకున్న ఒప్పందాల నుంచి వెనక్కి పోలేక పెట్టినవే. ఎన్నో వేల కోట్ల ఒప్పందాలు వెనక్కి పోయాయి.
నిజం చెప్పాలంటే ఏపీ పెట్టుబడులకు స్వర్గధామం. ప్రభుత్వం ఏమీ చేయకపోయినా పెట్టుబడులు పెడతారు. సుదీర్ఘమైన తీరం ఉండటం దీనికి కారణం. గత ప్రభుత్వం విస్తృతంగా శ్రమించి కియా లాంటి భారీ పరిశ్రమలతో పాటు ఎన్నో ఎలక్ట్రానిక్.. ఇతర పరిస్రమలను తీసుకొచ్చింది. పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. కానీ టీడీపీపై కక్ష సాధిస్తున్నామనుకుని మొత్తానికి ప్రజల పై కక్ష సాధిస్తూ… యువత భవిష్యత్‌ను వైసీపీ సర్కార్ అంధకారం చేసింది. ఇప్పటి వరకూ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఊరూ పేరూ లేని కంపెనీల శంకుస్థాపనలు చేస్తున్నారు కానీ అవన్నీ భూముల కోసమేనన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.