తిరుపతి కార్పొరేషన్ లో నామినేషన్ల ఉపసంహరణ ప్రహసనంగా మారింది. మెజార్టీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. అయితే… దాదాపుగా ప్రతీ డివిజన్లోనూ నామినేషన్లు వేసిన అభ్యర్థులు తాము నామినేషన్ ఉపసంహరించుకోలేదని… సంతకం ఫోర్జరీ చేశారని ఆందోళనకు దిగారు. ఏడో డివిజన్ అభ్యర్థి తీవ్ర స్థాయి పోరాటం చేయడంతో ఎస్ఈసీ ఎన్నికను వాయిదా వేసింది. ఇప్పుడు మిగతా డివిజన్ల అభ్యర్థులు కూడా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్లు వేశారు. చిత్తూరు కార్పొరేషన్ లోని 50 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 37 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి.
చిత్తూరులో అధికార పార్టీ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. 18 డివిజన్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు ఫోర్జరీతో విత్ డ్రా చేశారని, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేదాకా ఎన్నికల ప్రక్రియను నిలిపేయాలంటూ టీడీపీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఏడో డివిజన్ అభ్యర్థి వేసిన పిటిషన్ విచారణలో ఉంది. దీంతో రెండూ కలిపి సోమవారం విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినా.. ఎస్ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
బెదిరింపులతో ఏకగ్రీవం చేసుకోవడం సంగతి అటుంచితే అసలు అభ్యర్థులకు తెలియకుండా.. వారి సంతకాలను ఎవరో పెట్టేసి.. అధికారులతో ఉపసంహరణ చేయించేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి వీడియోలు ఉండాలి. కానీ.. అధికారులు అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం… ప్రజాస్వామ్య హక్కులు ఉల్లంఘించినట్లే అవుతుంది కాబట్టి… హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.