తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సీనియర్లు ఎవరైనా ఉన్నారా..? రేవంత్ రెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, జనారెడ్డి, సంపత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య.. ఇలా లిస్ట్ రాసుకుంటూ పోతే.. కాంగ్రెస్ పార్టీలో బాగా నోరున్న నేతలు.. అందరూ ఓడిపోయారు. అంతకు కొద్ది రోజుల ముందు.. ప్రత్యేకంగా కేటీఆర్ వీరందరి పేర్లు చెప్పి.. ఓడిపోతారని.. జోస్యం చెప్పారు. ఆ జోస్యం నిజం అయింది. ఏపీ ఎన్నికల్లోనూ.. అలాంటిదేదో జరగబోయింది. టీడీపీ తరపున.. వైసీపీపై.. ప్రత్యేకంగా నోరు చేసుకునే… నేతల్ని టార్గెట్ చేసుకుని.. ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఫామ్-7ల వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు.
తెలుగుదేశం పార్టీ తరపున తమ గళం వినిపిస్తున్న నేతల నియోజకవర్గాల్లో భారీగా ఓట్ల తొలగింపు దరఖాస్తులు వచ్చాయి. ఎపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు గంటా, సుజయ్ కృష్ణా రంగారావు, దేవినేని ఉమ, నక్కా ఆనంద్ బాబు, పరిటాల సునీత, వరదాపురం సూరితో పాటు మరికొంతమంది నేతలను లక్ష్యంగా చేసుకుని ఫాం 7 దరఖాస్తులు పెట్టారు. కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఫాం 7 కింద 6, 363 దరఖాస్తులను చేయగా, ఇందులో కేవలం రెండు మాత్రమే అసలైనవి. బొబ్బిలిలో మంత్రి సుజయకృష్ణ రంగారావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 5,904 దరఖాస్తులు రాగా ఇందులో ఐదు మాత్రమే అసలైవి. భీమిలి నియోజకవర్గంలో 7,815దరఖాస్తులు రాగా అందులో 101 మాత్రమే రియల్. తెలుగుదేశం పార్టీ తరపున వైసీపీపై విరుచుకుపడే తూర్పుగోదావరిజిల్లా ఫిఠాపురం ఎమ్మెల్యే వర్మ కు అనుకూలంగా ఉన్న ఓటర్లను తొలగించాలని 5వేల 231దరఖాస్తులు రాగా అందులో కేవలం 127 మాత్రమే నిజమైనవి.
ఇక జగన్ ప్రత్యేకంగా టార్గెట్గా పెట్టుకున్న దేవినేని ఉమ ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణాజిల్లా మైలవరంలో 6,334 టీడీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించాలని దరఖాస్తులు రాగా, 126 మాత్రమే నిజమైనవని ఆమోదించారు. తెలుగుదేశం తరపున స్వరం వినిపించే గుంటూరుజిల్లా మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరు నియోజకవర్గంలో 7, 158 దరఖాస్తులు వచ్చాయి. జగన్కు సరస్వతి భూముల వ్యవహారంలో జగన్ కు తలనొప్పి తెప్పించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గురజాల నియోజకర్గంలో 7, 859 దరఖాస్తులు వచ్చాయి. పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో 9వేల 748 దరఖాస్తులు రాగా, ఇందులో మూడింటిని మాత్రమే ఆమోదించారు. చెవిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఏకంగా 19వేల 225దరఖాస్తులు తొలగింపు కోసం వచ్చాయి. ఇందులో నిజమైనవి ఎనిమిది మాత్రమే. ఇవన్నీ చూస్తూంటే… అసలు ఏదో పెద్ద గూడుపుఠాణీనే ఉందన్న అనుమానాలు ప్రజల్లో బలంగా వస్తున్నాయి.