యాధృచ్చికంగా జరిగిపోతున్నాయో.. కావాలని చేస్తున్నారో తెలియదు కానీ.. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ.. ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకునే చేపల విషయంలో ఒక్కసారిగా నిషేధాన్ని విధించాయి. చేపల్లో ఫార్మాలిన్ అనే కెమికల్ కనిపించిందనేది ఆయా రాష్ట్రాల వాదన. ఇది క్యాన్సర్ కారకం. తాము జరిపిన పరీక్షల్లో చేపుల్లో ఈ ఫార్మాలిన్ కనిపించిందని.. అందుకే ఆంధ్రప్రదేశ్ నుంచి చేపల్ని దిగుమతి చేసుకోవద్దంటూ.. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, గోవా వంటి రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంపై ఏపీ అక్వా రైతుల్లో ఆందోళన వ్యక్తమయింది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఫార్మాలిన్ అనే కెమికల్ ఎవరూ వాడటం లేదని వారు చెబుతున్నారు. బీజేపీతో టీడీపీ పోరాడుతోంది కాబట్టి రాజకీయ కారణాలతోనే… ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాన్ చేశారని నమ్ముతున్నారు. ఎందుకంటే.. ఏపీ నుంచి గోవాకు చేపల ఎగుమతలు లేవు. అయినా ఆ రాష్ట్రం కూడా ఫార్మాలిన్ పేరుతో నిషేధ ఉత్తర్వులు జారీ చేసిందని.. వ్యాపారులు చెబుతున్నారు.
ఈ ఫార్మాలిన్.. చేపలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఉపయోగిస్తారు. కానీ అది కేన్సర్ కారకం కావడంతో.. ప్రభుత్వం కూడా దాన్ని వాడన వద్దని ఆదేశించింది. ఇప్పుడు ఏపీ రైతులపై అదే వాతుడున్నట్లు అభాండాలు వేయడంతో.. చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఎపీ నుంచి జరుగుతున్న ఎగుమతులను దెబ్బ తీసేందుకే కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులుక లేఖ రాశారు. దీనిపై ఇప్పటికే ఒక టాస్క్ ఫోర్స్ బృందాన్ని నియమించామని … ఎగుమతులు జరిగే ప్రాంతాల్లోనూ, పంపిణీ కేంద్రాల్లోనూ, రిటైల్ సెంటర్లలోనూ, ఫిష్ మార్కెట్లలోనూ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తన లేఖలో ఆయా రాష్ట్రాల సీఎంలకు వివరించారు. ఎగుమతులు చేసే ప్రతి ఒప్పందానికి ఫిష్ క్వాలిటీ, టెస్టింగ్ సర్టిఫికేట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇక ముందు నుంచి ఇస్తుందని, దీని ఆధారంగా ఎగుమతులను తీసుకోవచ్చని చంద్రబాబు సూచించారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులను గౌహతికి పంపారు. ఎపీ నుంచి వెళ్లిన చేపలను అక్కడి ప్రభుత్వాధికారులు, మీడియా సమక్షంలో తనిఖీ చేయగా, ఫార్మాలిన్ కలపలేదని నివేదిక వచ్చిందన్న విషయాన్ని సీఎం లేఖలో వివరించారు. దేశంలోని సముద్ర ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న ఎపీలో ఎగుమతులకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని దిగుమతులపై నిషేధాన్ని ఎత్తి వేయాలని కోరారు. ఏపీ బీజేపీని వ్యతిరేకిస్తోంది కాబట్టి.. ఆ పార్టీ ప్రభుత్వాలకు ఏపీ నుంచి వస్తున్న చేపలు కూడా చేదుగా ఉంటే ఎవరూ ఏం చేయలేరు…?. మొత్తం మోడీ, అమిత్ షా చేతుల్లోనే ఉంటుంది.