తమిళనాట అన్నాడీఎంకే విజయ్ పార్టీతో పోకుండా బీజేపీతో మళ్లీ కలిసేందుకు ఆ పార్టీ త్యాగం చేసింది. పార్టీని ఓ రేంజ్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన అన్నామలైను తప్పించిన బీజేపీ.. తాజాగా నైనార్ నాగేంద్ర అనే నేతను ఎంపిక చేసినట్లుగా ప్రకటించింది. చెన్నై పర్యటనకు వచ్చిన అమిత్ షా.. ఈ మేరకు ట్వీట్ చేశారు. నైనార్ నాగేంద్రం ఒక్కరే నామినేషన్ వేశారని ఆయననే తమిళనాడు అధ్యక్షుడిగా నియమించబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.
ఈ నైనార్ నాగేంద్రన్ బీజేపీ నేత కాదు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నేత. జయలలిత అన్నాడీఎంకేలో ఉన్నప్పుడు ఆమెకు నమ్మకస్తుడిగా కీలక నేతగా ఉన్నారు. తిరునల్వేలిలో బలమైన నేతగా ఎదిగారు. 2001-2006 మధ్య జయలలిత, ఓ. పన్నీర్‌సెల్వం నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో రవాణా, పరిశ్రమలు, విద్యుత్ శాఖల మంత్రిగా పనిచేశాడు. 2011లో తిరునెల్వేలి నుండి గెలిచినా మంత్రి పదవి దక్కలేదు. జయలలిత మరణం తర్వాత బీజేపీలో చేరారు. వెంటనే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా తిరునెల్వేలి నుండి అన్నాడీఎంకే మద్దదతుతో గెలిచారు. ప్రస్తుతం బీజేపీ శాసనసభ్యుల నాయకుడిగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు ఉండాలంటే అన్నామలై బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే సాధ్యం కాదని అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి స్పష్టం చేయడంతో హడావుడికి ఆయనను తప్పించింది బీజేపీ హైకమాండ్. వలస నేతకు చాన్సివ్వడంతో.. పొత్తులు ఖాయమైపోయాయి. అన్నామలై త్యాగానికి గుర్తుగా ఆయనను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.