తెలంగాణ బీజేపీలో నెలకొన్న రాజకీయ వివాదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి .. దున్నపోతును వాహనంలో ఎక్కించడానికి వెనుక నుంచి లాగించి తంతున్న వీడియోను పెట్టి… .తెలంగాణ బీజేపీ గాడిలో పడాలంటే నాయకత్వానికి ఇలాంటి ట్రీట్ మెంట్ అవసరం అని పోస్టు పెట్టారు. అంతే కాదు..వాటిని బీజేపీ అగ్రనేతలందరికీ ట్యాగ్ చేశారు. దీంతో ఒక్క సారిగా ఆ ట్వీట్ వైరల్ అయింది.
అది బండి సంజయ్ ను ఉద్దేశించి పెట్టినదేనంటూ ఇతర పార్టీల నేతలు హైలెట్ చేయడంతో కాసేపటికి తొలగించారు. ఏమనుకున్నారో కానీ మళ్లీ పోస్ట్ చేశారు. ఈ సారి కాస్త వివరణ ఇచ్చారు. తన పోస్ట్ బండి సంజయ్ ను వ్యతిరేకించేవారి గురించేనని వివరణ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లుగా ప్రచారాలు చేసే బీఆర్ఎస్ నేతలకు ఇది అర్థం కాదని మండిపడ్డారు. అయితే ఈ ట్వీట్ ను అందరూ బీజేపీలో తాజా పరిస్థితికి అద్దం పడుతోందన్నట్లుగా స్పందిస్తున్నారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. బీజేపీలో చేరిన వాళ్ల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు.
తెలంగాణ బీజేపీ నేతలెవరూ దీనిపై స్పందించలేదు. జితేందర్ రెడ్డి వ్యవహారం గుంభనంగానే ఉందని.. బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన కూడా తెలంగాణలో పరిస్థితుల పట్ల అసంతృప్తిగా ఉన్నారని పార్టీని వీడిపోతారని జరుగుతున్న ప్రచారంలో ఆయన పేరు కూడా ఉందని అంటున్నారు. ముందు ముందు ఏం చేస్తారో కానీ.. ఆయన పెట్టిన వీడియో.. తెలంగాణ బీజేపీ నాయకత్వం గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతున్నాయి.