ఐపీఎస్ అధికారిగా.. ఎన్నో సంచలనాత్మక కేసుల్ని.. ఎలాంటి తోట్రుపాటు లేకుండా విచారణ జరిపి.. చాలా పెద్ద పెద్ద మనుషుల్నే కటకటాలు లెక్కించేలా చేసిన.. సీబీఐ మాజీ జేడీకి … రాజకీయాలు ఇంకా వంటబట్టడం లేదు. అయనను అందరూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆయన కన్ఫ్యూజ్ కు గురవుతున్నారు. నిన్నటికిదాకా.. ఆయన లోక్ సత్తాలో చేరిపోయారని ప్రచారం ఉద్ధృతంగా జరిగింది. కానీ ఆాయన ఆ పార్టీలో చేరలేదట… తాను ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని.. కొత్త పార్టీనే పెట్టబోతున్నానని.. ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సీబీఐ మాజీ జేడీ ప్రకటనతో ఆశ్చర్యపోవడం చాలా మంది వంతు అయింది.
రాజకీయాల్లోకి రావాలన్న లక్ష్యంతోనే వీవీ లక్ష్మినారాయణ.. తన కెరీర్ ను అర్ఱాంతరంగా వదిలేసుకున్నారు. కానీ ఆయనకు.. ఎలా ముందుకెళ్లాలన్నదానిపై క్లారిటీ లేదు. సమస్యల అధ్యయనం పేరుతో… ఏపీ మొత్తం తిరిగారు. ప్రజల మేనిఫెస్టో పేరుతో.. ఓ ఎజెండా సిద్ధం చేసుకున్నారు. అయినప్పటికీ.. ఆయనకు తన రాజకీయ పయనంపై క్లారిటీ లేదు. మొదట్లో సొంత పార్టీ పెట్టడంపై ఆసక్తి లేదని.. ఉన్న పార్టీల్లోనే చేరుతానని.. తన ఎజెండాకు విలువనిచ్చే పార్టీలో చేరుతానన్నారు. జిల్లాల పర్యటనలు పూర్తయ్యాక… తీరా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మాత్రమే పిలిచాయి. వాటిలో చేరి ప్రయోజనం లేదనుకున్నారు. ఇతర పార్టీల నుంచి ఆహ్వానం రాలేదు. దానికి చాలా ఆయన నేపధ్యం, ఆరెస్సెస్ అభిమానం లాంటి కారణాలు ఉండి ఉండవచ్చు. చివరికి తన రాజకీయ లక్ష్యం నెరవేరాలంటే.. సొంత పార్టీనే బెటర్ అనుకున్నారు. ఆ దిశగా కసరత్తు చేశారు. అయితే.. ఈ లోపే ఆయనను మరో రాజకీయం … లోక్ సత్తా అధినేత జేపీ రూపంలో వచ్చి పడింది. వీవీ లక్ష్మినారాయణ… నే దీన్ని తెచ్చి పెట్టుకున్నారనుకోవాలి.. ఇటీవలి కాలంలో ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో .. లోక్ సత్తా జేపీని పొగిడారు. లోక్ సత్తా విషయంలో ప్రజలే ఫెయిలయ్యారని.. తీర్మానించారు. ఆ వెంటనే… జేపీ నుంచి… లక్ష్మినారాయణకు లైన్ కలిసింది.
అప్పటికే రాజకీయ పార్టీగా లోక్ సత్తాను నిర్వహించలేక… చేతులెత్తేసిన జేపీ… తన పార్టీ జేడీ చేతుల్లోకి వెళ్తే పునరుజ్జీవం పొందుతుందనుకున్నారు. కానీ.. దానికి ఆయన ఒప్పుకుంటారో లేదోనని… మీడియా ద్వారా.. తనకు తెలిసిన పొలిటికల్ మైండ్ గేమ్ ఆడారు. జేడీ ఏర్పాటు చేసుకున్న ఆత్మీయుల సమావేశానికి వెళ్లిపోయారు. అక్కడి నుంచి మీడియాకు లీకులు ఇచ్చారు. వీవీ లక్ష్మినారాయణ.. లోక్ సత్తాను టేకోవర్ చేసుకున్నారని.. ఆయనే చూసుకుంటారన్నట్లుగా… అవి ఉన్నాయి. ఈ రాజకీయం జేడీకి అర్థం కాలేదు. దాంతో.. ఆయన లోక్ సత్తాలో చేరిపోయినట్లుగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. నిజానికి ఆయనకు ఆ ఉద్దేశం లేదు.. సొంత పార్టీనే పెట్టుకోవాలనుకున్నారు. దాన్ని ప్రజలకు క్లారిటీ ఇవ్వడానికి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కానీ… ప్రజల్లో మాత్రం… లక్ష్మినారాయణకు… రాజకీయాల్లో ఇంకా ఒనమాలు కూడా తెలుసుకోలేకపోయారన్న అభిప్రాయం మాత్రం ఏర్పడింది.