భారత పారిశ్రామిక రంగానికి ఈ సండే బ్యాడ్ న్యూస్ తెచ్చింది. టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్ ప్రమాదంలో చనిపోయారు. ఆయన అహ్మదాబాద్ నుంచి ముంబై వస్తున్న సమయంలో ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ఉన్న వారు గాయాలతో బయటపడగా.. సైరస్ మిస్త్రి మాత్రం చనిపోయారు. ఆయన వయసు 54 ఏళ్లు మాత్రమే. దేశ కార్పొరేట్ రంగంలో ఎంతో గొప్ప ఎత్తుకు ఎదుగుతారనుకున్న ఆయన ఆకస్మాత్‌గా చనిపోయారు.
దేశంలో దిగ్గజ నిర్మాణ సంస్థల్లో ఒకటైన షాపూర్జీ పల్లోంజీకి వారసుడిగా పరిశ్రామిక రంగంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సైరస్ మిస్త్రీ.. టాటా గ్రూపులో అత్యధిక వ్యక్తిగత వాటాదారుగా ఉన్నారు. రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయనకే.. టాటా సన్స్ పగ్గాలను రతన్ టాటా తన తదనంతరం అప్పగించారు. మిస్త్రీ 2012లో రతన్ టాటా తర్వాత టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్) చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. సైరస్ మిస్త్రీ తన పనితీరుతో మెప్పించలేకపోయారు. టాటా కంపెనీలన్నింటీనీ అమ్మేయడం మంచిదన్నట్లుగా ఆయనతీరు ఉండటం.. చివరికి టీసీఎస్ విషయంలోనూ ఆయన వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూండటంతో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగిస్తూ టాటా గ్రూప్ నిర్ణయం తీసుకుంది.
దీనిపై మిస్త్రీ న్యాయపోరాటం చేశారు. తొలుత నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ మిస్త్రీని ఎగ్జిక్యూటివ్ (ఎన్సీఎల్ఏటీ) చైర్మన్ బాధ్యతల్లో పునఃనియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై టాటా సన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కార్పొరేట్ గవర్నర్స్‌కు సంబంధించి కొన్ని మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదని మిస్త్రీ కూడా అప్పీల్‌కు వెళ్లారు. ఈ క్రాస్ అప్పీళ్లను విచారించిన సుప్రీంకోర్టు, 2021 మార్చి 26న తుది తీర్పును ఇస్తూ, మిస్త్రీని తొలగిస్తూ, బోర్డ్ తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా రూలింగ్ ఇచ్చింది.