మహా నటుడుగా, అసాధారణ రాజకీయవేత్తగా ఎన్టీఆర్‌ను చూసిన వారెవరైనా సరే మర్చిపోవడం జరగని పని. కీర్తిశేషులు ఎన్టీరామారావు గురించి మిత్రుడు నవీన్ పెద్దాడ రాసిన విషయాలు చూస్తే కొన్ని ఘట్టాలు గుర్తుకు వచ్చాయి. ఎందుకంటే అశేష తెలుగు ప్రజానీకానికి ఆయన ఒక ఉత్తేజకర స్మృతి. ఎవరికి ఎన్ని తేడాలున్నా సరే- వ్యక్తిగా..కళాకారుడుగా…నాయకుడుగా ఆయన సాధించిన విజయాలను అభినందించకుండా వుండలేరు!
నటుడుగా ఎన్టీఆర్‌కు మాత్రమే స్వంతమైన ప్రత్యేకతలు మరోసారికి వాయిదా వేస్తే-ఆయన రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పుడు ఆ ప్రభావం ఎలా వుంటుందనే దానిపై రకరకాల అంచనాలుండేవి. విజయవాడ కెనాల్ గెస్ట్‌హౌస్‌లో మొదటి రాజకీయ పత్రికా గోష్టి నిర్వహించారు. ఆ రోజు రాజకీయాలకు సంబంధించి విలేకరులు అడిగిన చాలా ప్రశ్నలకు ఎన్టీఆర్ సూటిగానే సమాధానాలిచ్చారు. కాంగ్రెస్‌ను ఓడించడమే తమ ఏకైక లక్ష్యమని మిగిలిన వారంతా తన మిత్రులేనని ప్రకటించారు. వామపక్షాల గురించి అడిగితే అవన్నీ మా స్నేహితులే అన్నారు. మరి బిజెపితో కూడా చెలిమి చేస్తారా? అంటే ‘చెప్పాను గదా వామపక్షాలన్నీ మా మిత్రపక్షాలే..బిజెపి వామపక్షం’ అన్నారు. ఆయనకు సిద్ధాంత పట్టింపులు లేవని అర్థమైంది.
అయినా అదేమిటని ఎవరో సందేహం వెలిబుచ్చితే కాంగ్రెస్ ఒక్కటే శత్రువు. మిగిలినవన్నీ వామపక్షాలే అని మరోసారి చెప్పడం బట్టి ఆయన రెండు పదాలు ఒకటిగానే వాడుతున్నారని అర్థమైంది. (మరుసటి రోజున ఈనాడు పత్రిక ‘ప్రతిపక్షాలన్నీ మా మిత్రపక్షాలే’ అని పతాకశీర్షికనిచ్చింది. (ప్రజాశక్తిలో కూడా ఈవెనింగ్ ఎడిషన్‌లో అదే శీర్షిక వున్నా ఉదయానికి మారింది)
అప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సమయం. మీరు ఎవరిని బలపరుస్తారు? అని అడిగితే చెప్పిన సమాధానం ఆయన విజ్ఞతను ప్రతిబింబించింది. ఈ దేశ గౌరవాన్ని ప్రతిష్టను కాపాడేవారికే మా మద్దతు అన్నారు. అంటే జస్టిస్ ఖన్నాకా, జైల్సింగ్కా…అని వివరంగా అడిగితే ‘చెప్పాం కదా’ అని సమాధానం దాటేశారు. ఆయనతో వున్నవారు మాత్రం ‘ఖన్నాకే అని అర్థం అవుతుంది కదా’ అని వివరణిచ్చారు. అప్పటికి తెలుగుదేశంకు ఎంఎల్ఎలు లేరు గనక తొందరపడి ఏదో చెప్పి జైల్‌సింగ్‌ను ఎందుకు చెడ్డ చేసుకోవడం అని ఎన్టీఆర్ భావించినట్టు కనిపించింది.
ఆ పత్రికా గోష్టి మధ్యలో నాదెండ్ల భాస్కరరావు వచ్చి చేరారు. ఆ రోజున ఆయన పుట్టిన రోజు అని తెలియడంతో ఎన్టీఆర్ లేచి అభినందించి, ఆలింగనం చేసుకున్నారు. ‘మీకు రాజకీయానుభవం లేదంటున్నారు కదా?’ అనే ప్రశ్నకు ‘వీరున్నారు కదా..’ అని నాదెండ్లను చూపించారు. అప్పటికి చంద్రబాబు నాయుడు ఇంకా కాంగ్రెస్‌లోనే వుండగా డా.దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం యువ జనతా నుంచి మామగారి దగ్గర చేరారు. ‘మీ అల్లుడికి ఆధిపత్యం కల్పిస్తున్నారట కదా..’ అని అడిగినదానికి ‘ఆయన డాక్టరు. అనవసరంగా వీటన్నిటిలో ఎందుకు చిక్కుకుంటారు అని చెబుతున్నాను,’ అని వ్యాఖ్యానించారు. నిధుల వసూలు అల్లుడు చూస్తున్నాడనేదాన్ని తోసిపుచ్చుతూ ‘ఇంకా నిధి లేదు గనక అద్యక్షుడుగా నేనే చూసుకుంటున్నాను’ అని స్పష్టం చేశారు. కొన్ని ప్రశ్నలయ్యాక ఇంకా ఎవరో ఏదో అడగబోతుంటే ఆపి ‘పదండి.ఫలహారం చేద్దాం’ అని లోపలకి తీసుకెళ్లి మొదటి ఇద్దరు ముగ్గురికి తనే ఇడ్లీలు వడ్డించారు.
నేనే పదవికి అలంకారం
ముఖ్యమంత్రి అయ్యాక విజయవాడలో అప్పటి కమ్యూనిస్టు కార్పొరేషన్ ఎన్టీఆర్‌కు పౌరసన్మానం ఏర్పాటు చేసింది. మొదటి మేయర్ టి.వెంకటేశ్వరరావు ఒక గుర్రం బొమ్మ మెమొంటో ఇస్తూ “ఇటీవలనే తనకు మరింత శక్తి వుంటే ప్రజల కోసం ఇంకా పని చేయాలని వుందని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే ఆయన హార్స్ పవర్ పెరగాలని ఈ మెమొంటో అందిస్తున్నాం” అని చమత్కరించారు. ఎన్టీఆర్ చివరన మాట్లాడుతూ ‘ఈ పదవిలోకి రాకముందు కూడా మీ హృదయాలలో నాకొక పవిత్రమైన స్థానముంది. పదవికి నేను అలంకారం కావాలి గాని నాకు పదవి అలంకారం కాకూడదని నా ఉద్దేశం’ అన్నారు. (ఎందరో గొప్పవాళ్లు నిర్వహించిన పదవిని కించపర్చారని దీనిపై తర్వాత కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారు.)
ఇన్సాఫ్ చాహియే!
1984 ఆగష్టు 15న నాదెండ్ల వెన్నుపోటును ఆధారం చేసుకుని ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాలపై గవర్నర్ రాంలాల్ ఎన్టీఆర్‌ను నిరంకుశంగా తొలగించి అరెస్టు చేయించారు. రాష్ట్రం అట్టుడికి పోయింది. ఆ సమయంలోనూ అన్ని ప్రతిపక్షాల నిరసన ఉద్యమం విజయవాడ పిడబ్ల్యుడి మైదానం నుంచే మొదలైంది. ఎన్టీఆర్ కర్ర పట్టుకుని వున్నారు. తమ్ముడు త్రివిక్రమ రావు ఆయన వెంట వున్నారు. ఆ సమయంలో ఆవేశంగా ప్రసంగిస్తూ రాష్ట్రపతి జైల్‌సింగ్‌ను ఉద్దేశించి ‘ముజే ఇన్సాప్ చాహియే’ అంటూ బిగ్గరగా అన్నప్పుడు సభ వూగిపోయింది. (ఇదే మైదానంలో ఇదే తరహా సభ మరోసారి జరిగినప్పుడు పూర్తి భిన్నమైన దృశ్యం. తర్వాత చూద్దాం)
మహాప్రస్థాన పఠనం…
విజయవాడ కృష్ణాతీరంలో 1986లో మహానాడు నిర్వహించినప్పుడు ఎన్టీఆర్ ఏదో ఒక సమయంలో విలేకరులతో ముచ్చటించేవారు. అప్పటికి చంద్రబాబు నాయుడు కీలక పాత్రలోకి వచ్చేశారు. ఇద్దరు అల్లుళ్లు ఎవరి శిబిరం వారు అన్నట్టు నడుస్తున్న దశ. ఆ సభల ప్రారంభోపన్యాస సందర్భంలో ఎన్టీఆర్ వున్నట్టుండి శ్రీశ్రీ చరణాలు చదవడం మొదలుపెట్టారు. అందుకోసం మహాప్రస్థానం అడిగి తీసుకున్నారు. ‘ఘర్మజలానికి కర్మ జలానికి ఖరీదు కట్టే షరాబు లేడోరు’ అంటూ ఆవేశంగా ఒకటికి రెండు సార్లు చదివారు.
రైలు ఆపుతాను…
ఎన్టీఆర్ 1989 ఎన్నికల్లో ఓడిపోయినా కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా వి.పి.సింగ్ ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించారు. ఆ సమయంలోనే బిజెపి అయోధ్య సమస్య తీసుకొచ్చి సంక్షోభం సృష్టించింది. ఎల్.కె.అద్వానీ రథయాత్ర పేరిట రాజకీయ యాత్ర మొదలుపెట్టారు. ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ చాలా తాపత్రయపడ్డారు. అద్వానీకి నచ్చచెప్పడానికి ప్రయత్నించడమే కాదు – ఆయన రైలుకు వేళైందని బయిలుదేరబోతుంటే ‘కావాలంటే రైలు ఆపుతాను’ అంటూ సంక్షోభ నివారణకు యత్నించారు. అయినా బిజెపి ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో తర్వాత వారితో పొత్తు తెగతెంపులు చేసుకున్నారు. (చివరకు 1989 నవంబరు 7న కాంగ్రెస్ బిజెపి కలసి విపిసింగ్‌ను ఓడించాయి)
విశ్వామిత్ర పర్వం..
మరికొన్ని ఘట్టాలను వదలి 1991కి వస్తే అప్పుడు ఎన్టీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చేశారు. మరెవరూ చేయని విధంగా ముఖ్యమంత్రిగా వుండగానే నటించి నిర్మించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర ప్రత్యేక ప్రదర్శన ఎన్టీఆర్ ఎస్టేట్స్‌లో ఏర్పాటుచేశారు. చిత్రం చూసిన వారందరికీ మాతో సహా ఏమీ బాగాలేదని అర్థమై పోయింది. అది విశ్వామిత్రుని కథగా గాక రాముడు, హరిశ్చంద్రుడు వంటివారి కథల సముదాయంగా వుంది. మేనకగా వేసిన మీనాక్షి శేషాద్రితో అన్నగారి శృంగారాభినయం జోరుగా వుందనీ అనిపించింది. అంతా అయిపోయాక పత్రికలతో ముఖాముఖి కూచున్నారు…..
అప్పుడేమైంది?…ఎన్టీఆర్ రెండవసారి ఇడ్లీ కారంపొడి వడ్డించిందెప్పుడు..? మరో భాగంలో.