ఓ మాజీ ముఖ్యమంత్రి కక్కుర్తి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోట్ల ఆస్తులుండీ ఇదేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్యాస్ సబ్సిడీకోసం దరఖాస్తు చేయడం వివాదాస్పదమైంది. సబ్సిడీ లేని వంట గ్యాస్ కొనగలిగే స్తోమత ఉన్న వారు సబ్సిడీని వదులుకోండని ప్రధాని నరేంద్ర మోడీ కోరుతున్నారు. అర్హులైన వారికి సబ్సిడీ గ్యాస్ అందించడానికి సహకరించాలని విన్నవిస్తున్నారు. దీనికి స్పందించి దాదాపు 10 లక్షల మంది వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు గ్యాస్ సబ్సిడీ గ్యాస్ ను వదులుకున్నారు.
జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కోటీశ్వరుడు. ఆయన తండ్రి ఆ రాష్ట్రంలో తిరుగలేని నాయకుడిగా ఉన్నారు. చాలా కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. తండ్రి స్థాపించిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో పాటు, కొన్నేళ్ల పాటు సీఎం పదవిని కూడా ఫరూక్ అనుభవించారు. తర్వాత ఆయన కుమారుడు కూడా మొన్నటి వరకు సీఎంగా ఉన్నారు. ఇలా తరతరాలుగా రాజకీయంగా అన్ని రకాలుగా ఓ వెలుగు వెలిగారు.
ఇప్పుడు ఆయన నాన్ ఆధార్ బేస్ డ్ గ్యాస్ సబ్సిడీ కనెక్షన్ ట్రాన్స్ ఫర్ కోసం దరఖాస్తు చేశారు. ఆయన సబ్సిడీ వద్దంటారని అనుకుంటే దానికి భిన్నంగా స్పందించారు. దుర్గానాగ్ లోని హెచ్ పి గ్యాస్ డీలర్ కు ఆగస్టు 14న ఈ దరఖాస్తు ఇచ్చారట. మొన్న లోక్ సభ ఎన్నికల సమయంలో ఆయన స్వయంగా సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ 13కోట్లకు పైనే. ఏడాదికి తన ఆదాయం 10 లక్షలకు పైనే అని తెలిపారు. అంటే నెలకు దాదాపు లక్ష రూపాయలు. అలాంటి వ్యక్తి గ్యాస్ సబ్సిడీ అడగటం సంచలనం కలిగించింది.
ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పీడీపీ నాయకుడొకరు ఫరూక్ పై వ్యంగ్యాస్త్రం సంధించారు. ఆయన అంద గరీబు అయితే తాము ఆరేళ్ల పాటు ఫ్రీగా గ్యాస్ సరఫరా చేస్తామని ఎద్దేవా చేశారు.