బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మహిళా సర్పంచ్ ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే రాజయ్య తనను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఇది సంచలనంగా మారింది. స్టేషన్ ఘన్ పూర్ నుంచి గెలిచిన రాజయ్య తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. తర్వాత అవినీతి ఆరోపణల పేరుతో ఆయనను బర్తరఫ్ చేశారు కానీ.. మళ్లీ టిక్కెట్ ఇచ్చారు కేసీఆర్. అయితే ఆయన మాత్రం తన సహజ సిద్దమైన వ్యవహారశైలి మార్చుకోలేదు. ప్రతీ సారి వివాదాల్లోకి ఎక్కుతూనే ఉన్నారు. ముఖ్యంగా మహిళలతో ఆయన వ్యవహరించే తీరు సోషల్ మీడియాలో ఎన్ని సార్లు వైరల్ అయిందో చెప్పాల్సిన పని లేదు.
తాజాగా ఓ మహిళా సర్పంచ్ చేసిన ఆరోపణలతో… రాజయ్య వ్యవహారం వైరల్ అయింది. ఆయనపై కక్షతోనే రాజకీయ కారణాలతోనే సర్పంచ్ ఆరోపణలు చేశారని ఎవరూ అనుకోవడం లేదు. దీనికి కారణం రాజయ్య బ్యాక్ గ్రౌండే. అయితే ఆయన మాత్రం తన సహజ సిద్ధమైన రాజకీయ వాదనతో డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని.. సొంత పార్టీ లో వాళ్లే కుట్ర చేస్తున్నారని అన్నీ కేసీఆర్, కేటీఆర్ కు చెబుతానని చెప్పుకొచ్చారు.
మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కవిత దీక్ష చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ లో ఇలా ఓ మహిళా సర్పంచ్ వేధింపుల ఆరోపణలతో తెర మీదకు రావడంతో విపక్షాల అవకాశంగా అందిపుచ్చుకున్నాయి. బీఆర్ఎస్ లోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఇంకెలా ఉందో చెప్పాల్సిన పని ఏముందని ప్రశ్నిస్తున్నారు. రాజయ్య వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ అధినేతకు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది.