మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆయన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి త్వరలో వైకాపాలో జేరబోతున్నారని తాజా సమాచారం. వారిరువురు ఇప్పటికే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మధ్యవర్తుల ద్వారా సంప్రదించినట్లు తెలుస్తోంది. జగన్ కూడా వారిని పార్టీలో చేర్చుకొనేందుకు ఆసక్తి చూపడంతో వారు నేడో రేపో ఆయనని కలిసి కండువాలు మార్చుకొనే అవకాశం ఉంది. ఏరు దాటేక తెప్ప తగలేసినట్లుగా ఇంత కాలం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి అనుభవించి ఒక వెలుగు వెలిగిన ఆనం రామనారాయణ రెడ్డి, గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవడం కోసం పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఒక్కరే ఒంటరిగా పోరాడుతుంటే, పోతూపోతూ ఆయనపై బురదజల్లి పోతున్నారు. ప్రత్యేక హోదా కోసం రఘువీరా రెడ్డి చేపట్టిన ‘మట్టి సత్యాగ్రహం’ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, ప్రజాధారణలేని అటువంటి ఉద్యమాలు ఎన్ని చేసినా పార్టీకి ఎటువంటి ప్రయోజనం ఉండదని” అన్నారు.
ఆనం బ్రదర్స్ మొదట తెదేపాలో చేరేందుకు చాలా ప్రయత్నించారు కానీ వారిని చేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు అంగీకరించకపోవడంతో ప్రత్యామ్నాయంగా కనబడుతున్న వైకాపాలో చేరుతున్నారు. ఇక ఎలాగూ తెదేపాలో చేరే అవకాశం లేదని గ్రహించడంతో పనిలో పనిగా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ సమావేశం అవడంపై కూడా ఆనం చురకలు వేసారు. “అసలు పవన్ కళ్యాణ్ పనిగట్టుకొని వెళ్లి చంద్రబాబు నాయుడుని ఎందుకు కలిసారో? ఏమి మాట్లాడుకొన్నారో తెలియడం లేదు” అని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
ఆనం రామి నారాయాణ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి నమ్మిన బంటులా ఉండేవారు. ఆయన పోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ఆనం రామి నారాయణ రెడ్డే డిమాండ్ చేసారు. కనుక ఆయన పట్ల జగన్ కి కూడా సదాభిప్రాయమే ఉంది. అందుకే వైకాపాలో చేర్చుకోవడానికి అనుమతించినట్లున్నారు.