న్యాయమూర్తులపై ఫిర్యాదు చేస్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయడం.. దాన్ని మీడియాకు విడుదల చేయడంపై న్యాయనిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ న్యాయమూర్తులు.. చీఫ్ జస్టిస్ బోబ్డేకు లేఖలు రాసి తమ అభిప్రాయం చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నిస్సందేహంగా న్యాయవ్యవస్థపై దాడికి పాల్పడ్డారని… ఆయనపై చర్చలు తీసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని సూచనలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ నౌషద్ అలీ ఈ మేరకు.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఓ లేఖ రాశారు.
జస్టిస్ నౌషద్ అలీ.. న్యాయవ్యవస్థపై ఓ ప్రణాళిక ప్రకారం ఏపీలో దాడి జరుగుతోందని.. విశ్లేషించారు. మొత్తం పరిణామాలను ఆయన తన లేఖలో వివరించారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం.. కొంత మంది నేతలు న్యాయవ్యవస్థను ధిక్కరిస్తున్నట్లుగా ప్రకటనలు చేశారని అనుకున్నాను కానీ.. స్వయంగా జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం.. దాన్ని మీడియాకు విడుదల చేసి.. సొంత మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం చూసిన తర్వాత… అంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరుగుతోందన్న అభిప్రాయాన్ని జస్టిస్ నౌషద్ అలీ తన లేఖలో వ్యక్త పరిచారు.
న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని జగన్ దిగజార్చుతున్నారని.. ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై.. పథకం ప్రకారమే జగన్ దాడులు చేస్తున్నారని జస్టిస్ నౌషద్ అలీ స్పష్టం చేశారు. సీఎం జగన్ సీజేఐకి లేఖ రాయడం గర్హనీయం, ముమ్మాటికీ తప్పేనన్నారు. జగన్‌పై ఉన్న 31 కేసుల్లో తీర్పులు చెప్పే.. న్యాయమూర్తులపై ఈ లేఖ ప్రభావం పడే అవకాశం ఉందని.. తన కేసుల్లో లబ్ధికోసమే జగన్ ఇలాంటి లేఖలు రాస్తున్నారని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ పటిష్టతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని నౌషద్ లేఖలో సూచించారు.
నౌషద్ అలీ న్యాయవ్యవస్థపై ఏపీ సర్కార్ అనుసరిస్తున్న తీరును నిశితంగా పరిశీస్తున్నారు. వైసీపీ నేతలు వివిధ సందర్భాల్లో చేసిన ప్రకటనలు.. సాక్షి మీడియాలోచేసిన ప్రచారం.. ఇలా ప్రతీ అంశాన్ని వివరించారు. ఓ కుట్ర పూరితంగా న్యాయవ్యవస్థపై దాడి చేశారని.. నౌషద్ అలీ లేఖలో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని న్యాయవ్యవస్థను ధ్వంసం చేయడానికి పన్నిన కుట్రగా భావించి జగన్‌పై చర్యలు తీసుకోవాలని నౌషద్ అలీ సూచించారు.