అధికారంలోకి వచ్చినప్పటి నుండి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును వైసీపీ సర్కార్ వెంటాడుతోంది. అసలేం తప్పు చేశారో నాలుగేళ్లలో నిరూపించలేకపోగా .. ఆయనను మాత్రం రకరకాల కారణాలతో సస్పెన్షన్ లో ఉంచారు. ఇప్పుడు విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఐపీఎస్ అధికారి అయిన ఏబీవీకి ఆర్జిత సెలవులు ఉంటాయి. వాటిని సెలవులుగా ఉపయోగించుకుంటూ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీఎస్‌గా దరఖాస్తు చేసుకున్నారు.
అయితే సీఎస్ మాత్రం ఏ విషయం చెప్పలేదు. నిబంధనల ప్రకారం21 రోజుల వరకూ నిర్ణయం తీసుకోకపోతే అనుమతి వచ్చినట్లే. అయితే ఆ తర్వాత తనకు విచక్షణాధికారాలు ఉన్నాయని ఈఎల్స్ ఉపయోగించుకుని విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఏబీవీ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు అనుమతి నిరాకరిస్తూ సి ఎస్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది . విదేశాలకు వెళ్లేందుకు ఏబీవీకి అనుమతి ఇచ్ిచంది.
గత ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరావు పై వైసీపీ పెద్దలు ప్రభుత్వం రాగానే కక్ష సాధింపులు ప్రారంభించారు. సస్పెన్షన్ ను ఎత్తి వేయాలని హైకోర్టు ఆదేశించినా… పట్టించుకోలేదు. తర్వాత పోస్టింగ్ ఇచ్చి పదిహేను రోజుల్లో మళ్లీ సస్పెండ్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం నమోదు చేసిన అభియోగాలపై పూర్తిగా తేలకుండానే..ఆయనను డిస్మిస్ చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది. ఏబీ వెంకటేశ్వరరావును ఉద్యోగం నుంచి తొలగించడం, తప్పనిసరిగా పదవీ విరమణ చేయించడం కుదరదని స్పష్టం చేసింది.