మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఏసీబీ డీజీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 26న ఇంటెలిజెన్స్ డీజీ పదవి నుంచి ఏబీ వెంకటేశ్వరరావు ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయనను ఎన్నికలకు సంబంధం లేని పోస్టులో నియమించమని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలు ముగియడంతో ప్రస్తుతం పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు జీవో నెంబర్ 882ను విడుదల చేశారు. ఈసీ ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేయడాన్ని ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోడానికి నిరాకరిండచంతో ఇంటెలిజెన్స్ బాధ్యతల నుంచి తప్పించారు.
డీజీపీగా బాధ్యతలు చేపట్టే ముందు ఆర్పీ ఠాకూర్.. ఏసీపీ డీజీగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే.. ఎన్నికల కమిషన్ .. ఠాకూర్ వద్ద ఆ పోస్టును కూడా ఉంచలేదు. ఆయన పదవిని.. ఏసీబీలోనే డైరక్టర్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చీకి అప్పగించారు. ఇప్పుడు ఈ పోస్ట్‌ను… ఏబీ వెంకటేశ్వరరావుకు కేటాయించారు. అధికారవర్గాల్లో ఏసీబీ డీజీ పోస్ట్‌ను కీలకంగానే భావిస్తూంటారు. అలాంటి పోస్ట్ ను.. వెంకటేశ్వరరావుకు ప్రస్తుత పరిస్థితుల్లో కేటాయించడం కాస్త ఆశ్చర్యకరమే. అయినప్పటికీ… సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి, గవర్నర్ నరసింహన్ కు తప్పలేదన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. డీజీ హోదాలో ఉన్న వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఆ స్థాయిలో ఉన్న పదవి ప్రస్తుతం ఏసీబీ డీజీ ఒక్కటే. ఎవరినైనా బదిలీ చేసి… ఆ స్థానంలో ఏబీని నియమించాలంటే… ఈ సమయంలో బదిలీలు చాలా పెద్ద తలనొప్పి వ్యవహారం. ఇదంతా ఎందుకని.. ఆయనకు ఏసీబీ డీజీ కీలక పోస్టులో పోస్టింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఇంటలిజెన్స్ చీఫ్ గా లేకపోయినప్పటికీ.. ఆ శాఖపై పూర్తి కమాండ్ తో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న ఏబీ.. మరో కీలకమైన శాఖకు బాస్ అయ్యారు. ఆయన హవా పోలీస్ శాఖలో తగ్గే అవకాశం లేదని అంటున్నారు.