ఎప్పుడైనా అసలు సిసలు రాజకీయ పార్టీలు కొన్ని మాత్రమే ఉంటాయి. దేశంలో సవాలక్ష రాజకీయ పార్టీలున్నాయి. ఇవన్నీ నిజమైన రాజకీయ పార్టీలా? ఇందులో తొంభై శాతం పేపర్ మీద ఉండేవే. ఇలాంటి పార్టీలకు నాయకులుగా చెప్పుకునేవారు అప్పుడప్పుడు పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. భ్రష్టుపట్టిపోయిన రాజకీయాలను ఉద్ధరించడానికి రాజకీయాల్లోకి వచ్చామని, అవినీతిని నిర్మూలించడానికే రాజకీయాల్లోకి వచ్చామని, అందుకే పార్టీ పెట్టామని చెప్పుకున్న కొందరు పార్టీల అధినేతలు కాలక్రమంలో సోదిలోకి లేకుండాపోయారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు ఆంధ్రాలోనే ఆదరణ లేదు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నకల్లో చిత్తుగా ఓడిపోయింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి రెండు చోట్లా అత్యంత దారుణంగా ఓడిపోయాడు. గుడ్డిలో మెల్ల మాదిరిగా ఒక్కడు ఎమ్మెల్యేగా గెలిచాడు. పవన్‌తో పాటు మాజీ కాంగ్రెసు నాయకుడు కమ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తప్ప ఆ పార్టీలో జనానికి తెలిసిన నాయకుడే లేడు. గతంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొంతకాలం హడావిడి చేసి కనుమరుగయ్యాడు.
ఎన్నికల తరువాత కొంతమంది పార్టీ నుంచి వెళ్లిపోయారు. పవర్‌స్టార్ అంటూ సినిమా హీరోగా జనం చేత జేజేలు కొట్టించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా రాణించలేకపోవడం చూస్తూనే ఉన్నాం. హీరోగా తెలంగాణ, ఆంధ్రాలో అశేష అభిమానులను సంపాదించుకున్న పవన్ పార్టీ పెట్టిన తరువాత ఆంధ్రాకే పరిమితమయ్యాడు. ఆయన చేసే రాజకీయాలేవో అక్కడే చేస్తున్నాడు. తెలంగాణలో జనసేన ఉన్నట్లు పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ నాయకులు అనుకుంటున్నారు. వాస్తవానికి తెలంగాణలో జనసేన ఊసే లేదు. దాని ఉనికి ఉందని చెప్పుకుందామంటే పార్టీ తరపున ఏవో కార్యక్రమాలు జరగాలి కదా. అలాంటిదేమీ లేదు.
అధినేత హైదరాబాదులో పార్టీ కార్యకర్తల, నాయకుల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కూడా కనబడటంలేదు. అప్పుడప్పుడు పవన్ ఏవో సమస్యలపై ప్రకటనలు చేయడం తప్ప ఇతరత్రా ఏమీ లేదు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ జనసేనలో చీలిక వచ్చిందని, ‘జన శంఖారావం పార్టీ’ పేరుతో కొత్త పార్టీ ఆవిర్భవించిందని ఒకటి రెండు ఛానెళ్లలో వార్తాలొచ్చాయి. జనసేన నాయకుడు పర్దిపూర్ నర్సింహ కొత్త పార్టీకి అధ్యక్షుడు.
తెలంగాణలో ప్రతిపక్షాలు చతికిల పడుతున్న పరిస్థితిలో ఈ కొత్త పార్టీ స్థాపించామని చెప్పాడు. స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు గడిచినా…అంటూ రొటీన్ డైలాగులు చెప్పాడు. ఈ పర్దిపూర్ నర్సింహ గతంలో ప్రజారాజ్యంలో, తరువాత జనసేనలో కీలక నాయకుడట….! పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. పవన్‌కు సన్నిహితుడు కావచ్చు. జనాలకు ఎంత సన్నిహితుడో తెలియదు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. అది టీపార్టీ అవుతుందా? రాజకీయ పార్టీగా ఎదుగుతుందా? అనేది కాలక్రమంలో తెలుస్తుంది.