మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి వైసీపీకి షాకిచ్చేలా వ్యవహరిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన హైదరాబాాద్ నుంచి ఒంగోలు వచ్చి బలప్రదర్శన చేశారు. రైల్లో వచ్చిన ఆయనకు అనుచరులు భారీగా స్వాగతం పలికారు. కానీ ఎక్కడా వైసీపీ జెండానే కనిపించకపోవడంతో అందరూ ాశ్చర్యపోయారు. వందల మంది కార్యకర్తలు రైల్వే స్టేషన్ కి వచ్చినా ఎక్కడా పార్టీ జెండా కానీ, కండువా కానీ కనపడలేదు. అందరూ ఆయనకోసం పుష్పగుచ్ఛాలు తెచ్చి ఇచ్చారు. కారు వరకు వచ్చి జిందాబాద్ లు కొట్టారు. జై బాలినేని అన్నారే కానీ, జై జగన్ అనే నినాదాలు వినిపించలేదు.
బాలినేని వైసీపీలో ఉండాలనుకుంటే జగన్ మాటలకు కచ్చితంగా గౌరవం ఇచ్చేవారేమో. కానీ ఆయన కోఆర్డినేటర్ పదవి తనకు వద్దంటే వద్దని చెబుతున్నారు, తాను కేవలం నియోజకవర్గానికే పరిమితం అవుతానంటున్నారు. బాలినేని డీఎస్పీ విషయంలో అలకబూనారు. ఆ డీఎస్పీని రాత్రికి రాత్రి మార్చేశారు. అయినా సరే ఆయన వెనక్కి తగ్గడంలేదు. ఆయన జనసేనతో టచ్ లో ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల జనసేన ప్రకాశం జిల్లా నేతలు కూడా బాలినేని వస్తే తమకేం అభ్యంతరం లేదని చెప్పారు.
ఈ వార్తలన్నీ కలకలం రేపుతున్న సమయంలోనే బాలినేని ట్రైన్ లో ఒంగోలుకి వచ్చిన తర్వాత ఆయన అభిమానులు ఘన స్వాగతం పలకడం మరింత సంచలనంగా మారింది. ఇంతకీ బాలినేని వైసీపీ విషయంలో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ముందు ముందు తేలిపోతుంది. ఆయన టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని గోనె ప్రకాష్ రావు .. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. దీనిపై ప్రెస్ మీట్ పెట్టిన బాలినేని కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశారు. తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మథనపడుతున్నారు. మత్తంగా బాలినేని వ్యవహారం వైసీపీలో తుపాను అయ్యే సూచనలే కనిపిస్తున్నాయంటున్నారు.