అమెరికా పర్యటనలో ఉన్నమాజీ మంత్రి దేవినేని ఉమా ని మంగళవారం ఆగష్టు 16 నాడు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తెలుగు దేశం పార్టీ అభిమానులు ఘనంగా సత్కరించారు. పార్టీ ఆవిర్భావం నుండి నిస్వార్ధంగా సేవలందిస్తున్న దేవినేని ఉమా లాంటి సీనియర్ నాయకులు తెలుగు దేశం పార్టీకి వెన్నెముక లాంటివారని, ఎన్టీఆర్ స్పూర్తితో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో పార్టీకి పునర్వైభవం కోసం కృషి చెయ్యాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ ప్రవాసాంధ్రులంతా మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చెయ్యాలని పట్టాలు తప్పిన ప్రగతి చక్రాలని మళ్ళీ గాడిలో పెట్టి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. తెలుగు చలన చిత్ర రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొంది తెలుగు జాతి ఆత్మగౌరవమే నినాదంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి దేశ రాజకీయాలకు ఎన్ఠీఆర్ దశ,దిశ నిర్ధేశం చేసారని దేవినేని ఉమా తెలిపారు. నందమూరి అభిమానులుగా ఎన్టీఆర్ ఆశయసిద్ధికి నిరంతరం కృషి చెయ్యాల్సిన బాధ్యతని గుర్తు చేసారు. ఎన్టీఆర్, చంద్ర బాబు నాయుడు స్ఫూర్తిగా అమెరికా రాజకీయాల్లో కూడా తెలుగువారు రాణించే రోజులు రానున్నాయని దేవినేని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించిన అనంతరం ప్రారంభమైన కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. దేవినేని ఉమా లాంటి లాంటి నాయకులూ అరుదైన వారని, నీటి పారుదల శాఖా మంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి విశేష కృషి చేసి తనదైన ముద్ర వేశారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పొట్లూరి రవి, హరీష్ కోయా, శ్రీధర్ అప్పసాని, సునీల్ కోగంటి, హరి బుంగతావుల, హరి మోటుపల్లి, వంశి వాసిరెడ్డి, సుధాకర్ తురగా, సతీష్ తుమ్మల, గోపి వాగ్వాల, సాంబయ్య కోటపాటి, ఫణి కంతేటి, మోహన్ మల్ల ప్రసాద్ క్రొత్తపల్లి, రంజిత్ మామిడి, సురేష్ యలమంచి, సాంబయ్య కోటపాటి, రవి చిక్కాల తదితరులు పాల్గొన్నారు.