ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావును ప్రశ్నించిన తరవాత వరంగల్ లో పని చేస్తున్న సీఐలను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఎర్రబెల్లి కనుసన్నల్లో పని చేశారని పోలీసు వర్గాల్లో అందరికీ తెలుసు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లి పేరు రేపో మాపో బయటకు రావొచ్చని చెబుతున్నారు.
డీఎస్పీ ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు కావడంతో తెర వెనుక వున్న పెద్దల జాబితాను విచారణ అధికారులు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రుల హస్తం వుండే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతోంది. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుకు ‘ఎర్రబెల్లి’ స్వగ్రామం పర్వతగిరితో బంధుత్వం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి విచారణకు హాజరైన పోలీసు అధికారులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అత్యంత సన్నిహితులని ఇప్పటికే స్పష్టత రావడంతో కేసు ఆయన దగ్గరకే వస్తుందని అనుచరులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్కు ప్రతికూలంగా మారాయి. ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడంతో ఆ పార్టీలో స్తబ్ధత నెలకొంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీలోనే మకాం వేశారు. దీంతో పార్టీ నేతలు మౌనంగా వుండిపోయారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటుండటంతో ఏ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న భయాందోళన పార్టీ శ్రేణుల్లో వుంది. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు ఇంత వరకూ ఎలాంటి ప్రకటనలు చేయడంలేదు.