రామాయణకాలంలో రాముడి పాదుకలను ఎంతో ప్రేమగా మోసుకువెళ్ళి సింహాసనంమీద ఉంచాడు నాటి భరతుడు. అది సోదరప్రేమకు పరాకాష్ట. ఇప్పుడు తమ ప్రియతమ యువనాయకుని పాదుకలు మోసి తనకున్న విశ్వాసాన్నీ, నమ్మకాన్ని చాటుకున్నారు కేంద్ర మాజీ మంత్రి ఒకరు . పేరు చివర `గాంధీ’ అని ఉంటేచాలు పూనకం వచ్చినట్లు ఊగిపోయి సాష్టాంగప్రణామం చేసే పద్ధతికి ఇది పరాకాష్ట.
మొన్నటి భారీ వర్షాలకు చెన్నైతోపాటుగా పుదుచ్చేరి కూడా బాగాదెబ్బతింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధితులను పరమర్శించడానికి పుదుచ్చెరి వెళ్ళారు. ఆ సమయంలోనే మాజీ కేంద్ర మంత్రి వి. నారాయణస్వామి ప్రభువుపట్ల విశ్వాసాన్ని చాటేందుకు పాదుకలను మోశారు. రాహుల్ గాంధీ వరదప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడంతా బురదబురదా ఉంది. దీంతో ఆయనగారు తానువేసుకున్న పాదుకలను (షూస్ ను) విప్పేశారు. వెంటనే ఆయనపక్కనే ఉన్న నారాయణస్వామి ఆ పాదుకలను తన చేత్తో పట్టుకుని నడవడం ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో అటు రాహుల్ గాంధీ, ఇటు నారాయణస్వామి ఇద్దరూ ఇరుకునపడ్డారు.
ఏమిటో, రాహుల్ గాంధీని చూస్తుంటే జాలేస్తోంది. ఆయన ప్రజలవద్దకు ఎప్పుడు వెళ్ళినా ఏదోఒక వివాదం మెడకు చుట్టుకుంటూనేఉంది. మొన్నీమధ్యనే బెంగళూరులో విద్యార్థినులతో మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది. విద్యార్థినుల్లో కొంతమంది ఆయనకు బహిరంగలేఖలు రాస్తూ, ముక్కచివాట్లు పెట్టారు. అయినా ఇలాంటివన్నీ మామూలేనంటూ అక్కడి స్థానిక నేతలు తేలిగ్గాతీసుకున్నారు. ఇక ఇప్పుడు నారాయణస్వామి కూడా అలాగే మాట్లాడుతున్నారు. యుపీఏ-2 ప్రభుత్వంలో నారాయణస్వామి మంత్రిగా పనిచేశారు.
రాహుల్ గాంధీ కోసం చెప్పులు మోయడం తప్పేమీకాదనీ,అది తన బాధ్యతని అంటున్నారు ఈ మాజీ మంత్రి. పైగా ఒక కాంగ్రెస్ వర్కర్ గా తమ నాయకునికి ఇబ్బంది కలగకుండా చూసుకున్నామని సర్దిచెప్పుకుంటున్నారాయన. రాహుల్ వేసుకున్న చెప్పులను తాను మోయలేదనీ, బురదలో నడవడానికి ఇబ్బందిపడతారని కొత్త చెప్పులజత తీసుకువచ్చాననీ, దాన్నే మోసుకెళ్ళాలని వివరణ ఇచ్చారు ఈ మాజీ మంత్రి. ఆయన ఇప్పుడెంతగా వివరణ ఇచ్చుకున్నా ఏం ప్రయోజనం, ఇటు ప్రభుభక్తి పరాయణుడైన ఈయనకీ, అటు పార్టీకి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న ఆయనగారికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
మొత్తానికి రాహుల్ ఎక్కడికివెళ్ళినా ఏదో ఒక వివాదం ముసురుకోవడం ఏమిటో అర్థంకాక కాంగ్రెస్ గణాలు తల్లడిల్లుతున్నాయి.