భారతీయ జనతా పార్టీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కరోనా కారణంగా కన్ను మూశారు. ఆయనకు ఇరవై రోజుల క్రితం కరోనా సోకింది. ఆరోగ్యంగా ఉన్న ఆయన …తనకు కరోనా సోకిన విషయాన్ని వీడియో ద్వారా అందరికీ వెల్లడించారు . ఆ తర్వాత ప్రభుత్వ కోవిడ్ చికిత్స కేంద్రంలో చేరారు. అయితే..అక్కడ ఉన్నంత కాలం.. ఆయనకు కరోనా తగ్గకపోగా.. రాను రాను పరిస్థితి తీవ్రం అయింది. శ్వాస సమస్య కూడా రావడంతో.. వారం రోజుల క్రితం.. విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన శ్వాస సమస్య తీవ్రం కావడంతో చనిపోయారు.
భారతీయ జనతా పార్టీలో లో ప్రోఫైల్ మెయిన్‌టెయిన్ చేసే నేత మాణిక్యాలరావు. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా 2014లో తాడేపల్లిగూడెం సీటు దక్కింది. అక్కడి నుంచి పోటీ చేసేందుకు మాణిక్యాలరావు అవకాశం పొందారు. ఫోటోగ్రాఫర్‌గా జీవితం ప్రారంభించి.. ఆరెస్సెస్ లో కీలకంగా వ్యవహరిస్తూ రాజకీయంగా ఎదిగారు. తాడేపల్లిగూడెం నుంచి ఆయన గెలవడంతో పాటు టీడీపీ కూడా విజయం సాధించడంతో ఆయనకు మంత్రి యోగం కూడా దక్కింది. టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేంత వరకూ.. దేవాదాయ మంత్రిగా ఉన్నారు మాణిక్యాలరావు.
కరోనా సమయంలో.. ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ.. తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ చైర్మన్ తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఆ మాజీ చైర్మన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అనుమానంతో మాణిక్యాల రావు కూడా టెస్ట్ చేయించుకున్నారు. పాజిటివ్ అని తేలడంతో చికిత్స కోసం వెళ్లారు. కరోనా సోకితే ఏమీ కాదని.. కానీ గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని మాణిక్యాల రావు తన చివరి వీడియోలో పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనాతో చనిపోయిన మాజీ మంత్రి స్థాయి మొదటి నాయకుడు మాణిక్యాలరావే.